పాక్‌ జర్నలిస్టు ట్రోలింగ్‌.. వెంకటేశ్‌ ప్రసాద్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

11 Apr, 2021 18:22 IST|Sakshi
1996లో వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సొహైల్‌ ఔటైన తర్వాత వెంకటేశ్‌ ప్రసాద్‌ ఆనందం(ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా భారత-పాకిస్తాన్‌ జట్లు క్రికెట్‌ పోరులో ముఖాముఖి తలపడటం లేదు కానీ ఆయా జట్లు సమరం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతీ సందర్భంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై ప్రధాన ఫోకస్‌ ఉంటుంది. అది వరల్డ్‌కప్‌ అయితే ఇక ఆ సమరమే వేరు. అలా ఇరు జట్లు తలపడిన వరల్డ్‌కప్‌ సమరాల్లోని బెస్ట్‌ మూమెంట్స్‌లో 1996 వరల్డ్‌కప్‌ ఒకటి.

పాకిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన ఆనాటి క్వార్టర్‌ ఫైనల్లో అమిర్‌ సొహైల్‌-వెంకటేశ్‌ ప్రసాద్‌ల పోరు ప్రత్యేకం. వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన సొహైల్‌.. ప్రతీ బంతిని ఇలానే కొడతానని, వెళ్లి తెచ్చుకో అంటూ బ్యాట్‌తో సంకేతాలివ్వగా, ఆ మరుసటి బంతికే వెంకటేశ్‌ ప్రసాద్‌ బౌల్డ్‌ చేయడం ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటుంది. 

ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ వెంకటేశ్‌ ప్రసాద్‌ వారి మధ్య జరిగిన బ్యాట్‌-బంతి పోరును ట్వీటర్‌ వేదికగా ఫోటోతో సహా పోస్ట్‌ చేశాడు. దీనిపై పాకిస్తాన్‌ జర్నలిస్టు నజీబ్‌ ఉల్‌ హస్ననైన్‌ ట్రోలింగ్‌కు దిగాడు. ‘నువ్వు నీ కెరీర్‌లో సాధించిన ఘనత ఇదే కదా’ అంటూ వెటకారంగా స్పందించాడు. దానికి వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్‌ ఇచ్చాడు. ‘ నజీబ్‌ భాయ్‌. నేను ఆ తర్వాత కూడా కొన్ని ఘనతలు సాధిచాను. ఆ తర్వాత 1999 ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో మీ పాకిస్తాన్‌ జట్టుపైనే ఐదు వికెట్లు సాధించి 27 పరుగులిచ్చా,. దాంతో పాకిస్తాన్‌ 228 పరుగుల్ని కూడా సాధించలేక చతికిలబడింది. గాడ్‌ బ్లెస్‌ యూ’ అని రిప్లే ఇచ్చాడు.  

మరిన్ని వార్తలు