ఎదురులేని వెర్‌స్టాపెన్‌

6 Sep, 2021 05:55 IST|Sakshi

డచ్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

సీజన్‌లో ఏడో విజయం

జాండ్‌వోర్ట్‌: సొంత ప్రేక్షకుల మధ్య రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు తిరుగులేకుండా పోయింది. 36 ఏళ్ల విరామం తర్వాత ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్యాలెండర్‌లో పునరాగమనం చేసిన డచ్‌ గ్రాండ్‌ప్రిలో ఈ నెదర్లాండ్స్‌ డ్రైవరే విజేతగా నిలిచాడు. 72 ల్యాప్‌ల పాటు ఆదివారం జరిగిన ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. ల్యాప్‌ ల్యాప్‌కు ఆధిక్యాన్ని పెంచుకుంటూ గమ్యాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విన్నర్‌గా నిలిచాడు.

సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా... ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా గ్యాస్లీ (ఆల్ఫా టారీ), లెక్‌లెర్క్‌ (ఫెరారీ) నిలిచారు. తాజా విజయంతో వెర్‌స్టాపెన్‌ డ్రైవర్‌ చాంపియన్‌íÙప్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అతడు 224.5 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్ల తేడాతో హామిల్టన్‌ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు