ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే

12 Jan, 2021 20:01 IST|Sakshi

టీమిండియాలో కోపానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరంటే టక్కున గుర్తుచ్చే పేరు కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌. 2005లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌ మొదటి నుంచే అగ్రెసివ్‌ క్రికెటర్‌గా పేరు పొందాడు. తన కెరీర్‌ మొత్తంలో ఎక్కువశాతం గొడవలతోనే ఫేమస్‌ అయ్యాడు. తాను వేసే బంతుల కన్నా చూపులతోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లను భయపెట్టడానికి ప్రయత్నించేవాడు.

తాజాగా ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్‌ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌ తొలి మ్యాచ్‌లోనే వికెట్‌ పడగొట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తం 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఆ ఆనంద సమయంలో కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశాంత్‌ స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నాడు. ఏడేళ్ల తర్వాత సొంత జట్టు తరపున వికెట్‌ తీయడం ఆనందంగా ఉంది. నా జీవితంలో చీకటి రోజులు ముగిసిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇది. ఇన్నాళ్ల తర్వాత కూడా అభిమానులు నాపై చూపించిని ప్రేమ, మద్దతుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశాడు.

టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్‌ తన సహచర క్రికెటర్లైన అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది. అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. దాంతో గతేడా ఏడాది సెప్టెంబర్‌తో శ్రీశాంత్‌ శిక్షాకాలం పూర్తయింది.

దీంతో కేరళ తరపున ముస్తాక్‌ అలీ ట్రోపీలో ఆడేందుకు శ్రీశాంత్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. కొన్ని వారాల క్రితం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై కోపంగా చూడడం.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడేళ్ల తర్వాత కూడా శ్రీశాంత్‌ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. 

మరిన్ని వార్తలు