Anrich Nortje: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే!

27 Dec, 2022 16:20 IST|Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌లో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి మన ప్రాణం మీదకు వచ్చే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్టేడియాల్లో స్పైడర్‌ కెమెరాలు ఉండడం సహజం. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ప్రతీవైపును కవర్‌ చేయడమే స్పైడర్‌ కెమెరాల పని. అయితే గ్రౌండ్‌లో మినిమం ఎత్తులో ఉండే ఈ కెమెరాలు ఒక్కోసారి ఆటగాళ్ల కదలికలను గమనించేందుకు నిర్దేశించిన ఎత్తుకంటే కిందకు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఆటగాళ్లకు ఈ స్పైడర్‌ కెమెరాలు ఇబ్బందికి గురి చేస్తుంటాయి.

తాజాగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక స్పైడర్‌ కెమెరా ప్రొటీస్‌ బౌలర్‌ అన్‌రిచ్‌ నోర్ట్జే ప్రాణం మీదకు తెచ్చింది. మెల్‌బోర్న్‌ వేదికగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో ఇది చోటుచేసుకుంది. రెండో సెషన్‌లో ఓవర్‌ ముగిశాక బ్రేక్‌ సమయంలో ఒక స్పైడర్‌ కెమెరా నోర్ట్జే వైపు దూసుకొచ్చింది. అయితే వెనుకవైపు నిలబడిన నోర్ట్జే ఇది గమనించలేదు. అంతే వేగంగా వచ్చిన కెమెరా అతన్ని తలను బలంగా ఢీకొట్టింది. కెమెరా దెబ్బకు గ్రౌండ్‌పై పడిపోయిన నోర్ట్జే తిరిగి పైకి లేచాడు. అయితే ఇది గమనించిన స్మిత్‌ నోర్ట్జే దగ్గరకు వెళ్లి ఎలా ఉందని అడిగాడు.. దానికి ప్రొటీస్‌ బౌలర్‌ పర్లేదు.. బాగానే ఉన్నా అని చెప్పడంతో సహచరులతో పాటు అంపైర్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఒకవేళ​ స్పైడర్‌ కెమెరా గట్టిగా తాకి జరగరానిది ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేశారు. నోర్ట్జేకు లక్కీగా పెద్ద గాయం కాలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోయుంటే ఇది ఎక్కడికి దారి తీసేదో అని తలుచుకుంటేనే భయమేస్తుంది. అంటూ మరొకరు పేర్కొన్నారు. మొత్తానికి మైదానాన్ని కనిపెట్టుకొని ఉండాల్సిన స్పైడర్‌ కెమెరా నోర్ట్జే ప్రాణం మీదకు తెచ్చింది. 

ఇక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ట్రెవిస్‌ హెడ్‌ 48 బ్యాటింగ్‌, అలెక్స్‌ కేరీ 9 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నారు.  సీనియర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సూపర్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. కొంతకాలంగా ఆటకంటే కెప్టెన్సీపై క్రికెట్‌ ఆస్ట్రేలియాతో వివాదంతో వార్తల్లో నిలిచిన వార్నర్‌ ఎట్టకేలకు డబుల​ సెంచరీ సాధించి విమర్శకుల నోర్లు మూయించాడు. ఇక స్టీవ్‌ స్మిత్‌ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్ర​స్తుతం ఆసీస్‌ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్‌ రాజా

మరిన్ని వార్తలు