Vietnam Open: పోరాడి ఓడిన రుత్విక.. అదరగొట్టిన సిక్కిరెడ్డి- రోహన్‌ జోడీ

30 Sep, 2022 09:50 IST|Sakshi
సిక్కిరెడ్డి (PC: BAI Media Twitter )

క్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి జోడి

Vietnam Open 2022- హో చి మిన్‌ సిటీ: వియత్నాం ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి సిక్కిరెడ్డి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దూసుకెళుతోంది. రోహన్‌ కపూర్‌తో జతకట్టిన ఆమె క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి– రోహన్‌ జోడీ 21–10, 19–21, 21–18తో ఎనిమిదో సీడ్‌ యుంగ్‌ షింగ్‌ చొయ్‌–ఫాన్‌ క యాన్‌ (హాంకాంగ్‌) జంటను కంగు తినిపించింది.

శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో భారత ద్వయం మలేసియాకు చెందిన మూడో సీడ్‌ చాన్‌ పెంగ్‌ సున్‌–చి యి సి జోడీతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్‌ మేకల కిరణ్‌ కుమార్‌ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. వరుస విజయాలతో ప్రిక్వార్టర్స్‌ చేరిన కిరణ్‌ ఇక్కడ మాత్రం వరుస గేముల్లో 15–21, 10–21తో చిమ్‌ జున్‌ వి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు.

మహిళల సింగిల్స్‌లోనూ భారత ప్లేయర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. హైదరాబాద్‌ షట్లర్‌ గద్దె రుత్విక శివాని 21–15, 18–21, 17–21తో స్థానిక ప్లేయర్‌ తి త్రంగ్‌ వు చేతిలో పోరాడి ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో రీతుపర్ణ దాస్‌ 15–21, 16–21తో తి ఫుంగ్‌తుయ్‌ ట్రాన్‌ (వియత్నాం) చేతిలో ఓడిపోగా... నీలూరి ప్రేరణ 3–21, 7–21తో టాప్‌సీడ్‌ అయ ఒహొరి (జపాన్‌) ధాటికి నిలువలేకపోయింది. 

మరిన్ని వార్తలు