సంకట్‌ మోచన్‌ ‘హనుమ’

12 Jan, 2021 10:02 IST|Sakshi

సిడ్నీ: 12 టెస్టుల్లో ఒకటి మినహా అన్నీ విదేశాల్లో ఆడినవే... ఇతర బ్యాట్స్‌మెన్‌ తరహాలో స్వదేశంలో టన్నులకొద్దీ పరుగులు సాధించి స్థానం సుస్థిరం చేసుకునే అవకాశం దక్కలేదు. కానీ విమర్శకుల కత్తి పదును మాత్రం హనుమ విహారి వైపే ఉంది. తాజా సిరీస్‌లో విహారి స్కోర్లు వరుసగా 16, 8, 21, 4 కావడంపై అతను టెస్టు జట్టులో ఉండటమే అనవసరం అన్నట్లుగా విశ్లేషకులు విరుచుకుపడ్డారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కూడా నీకు నేనున్నానంటూ అండగా నిలబడే వ్యక్తులు కూడా విహారికి ఎవరూ లేరు! ఈ టెస్టులో మయాంక్‌ను కాకుండా విహారినే తీసేయాల్సిందంటూ వ్యాఖ్యలు వినిపించాయి.

చివరి క్షణంలో అదృష్టవశాత్తూ అతను స్థానం నిలబెట్టుకున్నాడు. ఇలాంటి స్థితిలో తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యం తర్వాత మ్యాచ్‌ను కాపాడాల్సిన ఒత్తిడిలో విహారి మైదానంలోకి దిగాడు. సరిగ్గా చెప్పాలంటే తన కెరీర్‌ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఏం జరిగినా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 18వ బంతికిగానీ తొలి పరుగు తీయలేదు. మరో 10 బంతులు కూడా ఆడలేదు... తొడ కండరాలు పట్టేశాయి! రన్నర్‌కు అవకాశం లేదు కాబట్టి కొనసాగేందుకు సిద్ధమైపోయాడు. నొప్పి పెరిగింది, సింగిల్‌ కూడా తీయలేని పరిస్థితి.

పరుగు తీసే ప్రయత్నంలో కుంటుతూ వెళ్లాల్సి రావడంతో ఇక నా వల్ల కాదన్నట్లుగా మధ్యలోనే ఆగిపోయాడు. ఫీల్డర్‌ డైరెక్ట్‌ హిట్‌ కొడితే 3 పరుగుల వద్దే ఖేల్‌ ఖతమయ్యేది. ఇలాంటి సమయంలో విహారి అనుకుంటే ఆటను వదిలి పెవిలియన్‌కు వెళ్లిపోయేవాడు. కానీ అతను ఆ పని చేయలేదు. అన్ని అడ్డంకులను పక్కన పెట్టి పట్టుదలగా నిలబడ్డాడు. ఎలాగైనా ఆసీస్‌ విజయాన్ని అడ్డుకోవాలని భావించిన విహారి ప్రతీ బంతిని నిరోధించేందుకు సిద్ధమైపోయాడు. ఇక అతని మనసులో ఆంజనేయుడి తరహాలో భారత జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఆలోచన తప్ప గాయం గుర్తుకే రాలేదు.

50 బంతుల్లో 4 పరుగులు... 100 బంతుల్లో 6 పరుగులు... అవసరమైనప్పుడు జిడ్డుగా ఆడటం ఏమిటో ఈ ఆంధ్ర క్రికెటర్‌ ఇలా చూపించాడు! ఎట్టకేలకు దాదాపు మ్యాచ్‌ ఫలితం తేలిన తర్వాత 125 బంతికి అతని తొలి ఫోర్‌ వచ్చింది. మధ్యలో కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నా సరే... లక్ష్యం చేరే వరకు ఆగకూడదని భావించిన విహారి చివరికంటా నిలిచి తన విలువేమిటో చూపించాడు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను ఆడిన శైలి అద్భుతమంటూ ప్రముఖులు పొగుడుతున్నారు. దురదృష్టవశాత్తూ తర్వాతి టెస్టుకు దూరమవుతున్నా... విహారి సిడ్నీ ప్రదర్శనను ఎవరూ రాబోయే రోజుల్లో మరచిపోరు. భారత అభిమానుల దృష్టిలో అతను ప్రాణం పోతున్న సమయంలో సంజీవని తెచ్చి బతికించిన హనుమంతుడు!

మరిన్ని వార్తలు