విహారికి ఎప్పటికీ గుర్తుండిపోయే కౌంటీ అరంగేట్రం!

16 Apr, 2021 18:59 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌:  ఇంగ్లండ్‌ దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ల్లో భాగంగా అక్కడ జరిగే కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హనుమ విహారి చెత్త రికార్డు నమోదు చేశాడు. వార్విక్‌షైర్‌ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్న విహారికి తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది.  40 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 23 బంతుల్ని ఎదుర్కొన్న విహారి డకౌట్‌ అయ్యాడు. బ్రాడ్‌ బౌలింగ్‌లో  స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హసీబ్‌ హమీద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.  ఇది విహారికి మరచిపోలేని కౌంటీ అరంగేట్రంగా ఎప్పటికీ గుర్తుండి పోవడం ఖాయం.  కాగా, ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు విహారి. నాటింగ్‌హామ్‌షైర్‌ ఇన్నింగ్స్‌ చేస్తున్నప్పుడు వన్‌ హ్యాండెడ్‌ డైవింగ్‌ క్యాచ్‌తో అలరించాడు. విల్‌ రోడ్స్‌ బౌలింగ్‌లో స్టీవన్‌ ములానే(31) ఇచ్చిన క్యాచ్‌ను‌ అద్భుతంగా అందుకున్నాడు. 

ఐపీఎల్‌ ముగిశాక భారత క్రికెట్‌ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్‌ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నాడు.  2019 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా  ముద్రపడటంతో 2020, 2021 సీజన్‌లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. 

మరిన్ని వార్తలు