ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా.. ప్రత్యర్ధి 99 పరుగులకు ఆలౌట్‌

29 Nov, 2023 12:53 IST|Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో సౌరాష్ట్ర బౌలర్‌ ధరేంద్రసిన్హ్‌ జడేజా ఐదు వికెట్ల ఘనతతో చెలరేగాడు. ఒడిశాతో ఇవాళ (నవంబర్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో 5.1 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఈ ఫీట్‌ను సాధించాడు. జడేజా ధాటికి టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒడిశా 29.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజాతో పాటు అంకుర్‌ పన్వార్‌ (7-1-28-2), ప్రేరక్‌ మన్కడ్‌ (5-1-13-2), కెప్టెన్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ (5-0-11-1) కూడా రాణించారు.

ఒడిశా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సందీప్‌ పట్నాయక్‌ (42), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుభ్రాన్షు సేనాపతి (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హార్విక్‌ దేశాయ్‌ (11), షెల్డన్‌ జాక్సన్‌ (4), జయ్‌ గోహిల్‌ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. చతేశ్వర్‌ పుజారా (2), విశ్వరాజ్‌ జడేజా (13) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా దేశవాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకే ఆడతాడన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు