Ruturaj Gaikwad: నయా రన్‌ మెషీన్‌ రుతురాజ్‌.. ఆఖరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 8 శతకాలు

3 Dec, 2022 18:16 IST|Sakshi

ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రన్‌ మెషీన్‌ ఆవిర్భవించాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ టోర్నీల్లో 50 ఓవర్ల మ్యాచ్‌లు) అతను పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. ఈ ఫార్మాట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. బరిలోకి దిగాడంటే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. ప్రత్యర్ధి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న ఆ ఆటగాడే రుతురాజ్‌ గైక్వాడ్‌.

విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో మహారాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ పూణే చిన్నోడు.. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా మారాడు. ఇప్పటివరకు రన్‌ మెషీన్‌ అనే ట్యాగ్‌ టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి మాత్రమే సూటయ్యేది. ఇప్పుడు ఆ ట్యాగ్‌కు నేను కూడా అర్హుడినే అంటూ రుతురాజ్‌ రేస్‌లోకి వచ్చాడు. తాజాగా ముగిసిన విజయ్‌ హజారే ట్రోఫీలో, అంతకుముందు సీజన్‌లో అతని గణాంకాలు చూసిన వారెవరైనా ఈ విషయంతో ఏకీభవించాల్సిందే. ఎందుకంటే పరిస్థితులపై అంతలా ప్రభావం చూపాడు ఈ చెన్నై సూపర్‌ కింగ్‌ (ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు). 

గత విజయ్‌ హజారే ట్రోఫీలో మొదలైన రుతురాజ్‌ శతకాల దండయాత్ర, పరుగుల సునామీ తాజా సీజన్‌లో సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్‌ వరకు అప్రతిహతంగా కొనసాగింది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో 108 పరుగులు సాధించిన రుతురాజ్‌.. అంతకుముందు సెమీస్‌లో 168 (126), క్వార్టర్‌ ఫైనల్లో 220 నాటౌట్‌ (159), ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో 40 (42), గ్రూప్‌ మ్యాచ్‌లో రైల్వేస్‌పై 124 నాటౌట్‌ (123) పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రుతురాజ్‌.. 3 సెంచరీలు, ఓ డబుల్‌ సెంచరీ బాదాడు. యూపీతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆకాశమమే హద్దుగా చెలరేగిన రుతురాజ్‌.. ఓ ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

ఇక విజయ్‌ హజారే ట్రోఫీ-2021 విషయానికి వస్తే.. గత సీజన్‌లో మహారాష్ట్ర ఆడిన ఆఖరి మ్యాచ్‌లో 168 (132) పరుగులు చేసిన రుతురాజ్‌, అంతకుముందు కేరళ (124), చత్తీస్‌గడ్‌ (154 నాటౌట్‌), మేఘాలయ (136)లపై హ్యాట్రిక్‌ సెంచరీలు బాదాడు. ఈ యువ డాషింగ్‌ ఆటగాడు తాజా సీజన్‌లోనూ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ సెంచరీలు బాది, డబుల్‌ హ్యాట్రిక్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.  తన 71 ఇన్నింగ్స్‌ల చిన్నపాటి లిస్ట్‌-ఏ కెరీర్‌లో రుతురాజ్‌.. 61.12 సగటున 15 సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 4034 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో మరే ఆటగాడికి 60కి మించి సగటు లేదు. 

టీమిండియా తరఫున ఓ వన్డే, 9 టీ20లు ఆడిన 25 ఏళ్ల రుతురాజ్‌.. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, దేశవాలీ టోర్నీల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడే ఇతను.. 36 మ్యాచ్‌ల్లో 130.3 స్ట్రయిక్‌ రేట్‌తో 1207 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్‌ సెంచరీలు, ఓ సెంచరీ కూడా ఉంది.      


 

మరిన్ని వార్తలు