ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా..

24 Dec, 2022 07:23 IST|Sakshi
బీసీసీఐ లోగో (PC: BCCI Twitter)

Vijay Merchant Trophy- సూరత్‌: భారత దేశవాళీ క్రికెట్‌లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్‌ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్‌–16 టోర్నీ (విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది.

ఓపెనర్, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అన్వీష్‌ ఒక ఫోర్‌ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్‌ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్‌లో ముందుగా మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్‌ చేయగా... తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఇక ఈ మ్యాచ్‌ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సిక్కిం ఓపెనర్‌ రోహిత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే అవుట్‌ కావడంతో భారత సారథి రోహిత్‌ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్‌ దిన్రీ రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌ కెప్టెన్‌ మనాల్‌ చౌహాన్‌ 170 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్‌ రషీద్‌?

మరిన్ని వార్తలు