Vijender Singh: 19 నెలలు గ్యాప్‌ వచ్చినా.. ఏ మాత్రం తగ్గని జోరు

18 Aug, 2022 13:48 IST|Sakshi

భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌.. రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు 19 నెలల పాటు దూరంగా ఉన్న ఈ స్టార్‌ బాక్సర్‌ బుధవారం రాయపూర్‌లోని బల్బీర్‌ సింగ్‌ జునేజా స్టేడియంలో 'జంగిల్‌ రంబుల్‌' నాకౌట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నాడు.  సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ విభాగంలో ఘనా బాక్సర్‌ ఎలియాసు సుల్లీని.. విజేందర్‌ తన పంచ్‌ పవర్‌తో చిత్తు చేశాడు. కాగా విజేందర్‌కు ఇది 13వ బౌట్ విజయం. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ నాకౌట్‌లో 13-1తో తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు.

మ్యాచ్‌ అనంతరం విజేందర్‌ సింగ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ''రాయపూర్‌ ప్రజలకు నా ధన్యవాదాలు. నా టీమ్‌తో కలిసి చత్తీస్‌ఘర్‌కు రావడం సంతోషంగా ఉంది. గత రెండేళ్ల నుంచి మేము ఎలాంటి బౌట్స్‌కు దిగలేదు. 19 నెలల విరామం తర్వాత కెరీర్‌ను విజయంతో  ఆరంభించడం మంచి సూచకం. ఈ బ్రేక్‌ తర్వాత నేను తలపడిన ఘనా బాక్సర్‌ మీ దృష్టిలో అంత పేరున్న బాక్సర్‌ కాకపోవచ్చు. కానీ నాకు, టీమ్‌కు, నా సహాయ సిబ్బందికి అతని పంచ్‌ పవర్‌పై అవగాహన ఉంది.

అందుకే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ ముగించాలని అనుకున్నా. ఈ క్రమంలోనే చత్తీస్‌ఘర్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌కు ధన్యవాదాలు. ఈ మ్యాచ్‌ నిర్వహించడంలో ఆయన మద్దతు చాలా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ యువతను క్రీడలకు మరింత దగ్గర చేయడం ఒక బహుమతిగా అనుకోవచ్చు. ఇక నా తర్వాతి బౌట్‌ డిసెంబర్‌లో జరగనుంది. దానికోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

మరిన్ని వార్తలు