Team India Next Head Coach: టీమిండియా తదుపరి కోచ్‌ అతడేనా?

24 Aug, 2021 18:53 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ తర్వాత ముగియనుండటంతో అతని వారసుడు ఎవరనే అంశంపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఈ విషయమై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న విక్రమ్ రాథోడ్.. తదుపరి చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా బీసీసీఐ పెద్దలు సైతం రాథోడ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. 

గత కొద్దికాలంగా టీమిండియా కోచ్ పదవి రేసులో రాహుల్ ద్రవిడ్ ముందున్నాడనే వార్తలు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్‌కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మతోనూ రాథోడ్‌ సత్సంబంధాలు కలిగి ఉండటం అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. మరోవైపు కోచ్‌ పదవి రేసులో రాథోడ్‌ సహా టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌​ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. ఏదిఏమైనప్పటికీ.. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దాకా టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవిపై సస్పెన్స్‌ కొనసాగనుంది.
చదవండి: లార్డ్స్‌ టెస్ట్‌ మాకో గుణపాఠం.. ఇకపై వివాదాల జోలికి వెళ్లం: రూట్‌

మరిన్ని వార్తలు