రెజ్లర్‌ వినేశ్‌కు ‘నెగెటివ్‌’ 

3 Sep, 2020 08:26 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ కరోనా వైరస్‌ నుంచి బయటపడింది. ఈ మహమ్మారి బారిన పడిన ఆమె గత నెల 29న జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు కూడా దూరమైంది. అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న’కు ఎంపికైన 24 ఏళ్ల వినేశ్‌ కోవిడ్‌–19 నుంచి పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం తెలిపింది. తాజాగా నిర్వహించిన రెండు నిర్ధారణ పరీక్షల్లోనూ తనకు నెగెటివ్‌ ఫలితం వచ్చిందని వెల్లడించింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మరికొన్ని రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉంటానని చెప్పింది.

‘మంగళవారం మరోసారి కోవిడ్‌–19 పరీక్షకు హాజరయ్యా. అందులోనూ నెగెటివ్‌ ఫలితం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కానీ మరికొన్ని రోజులు ఐసోలేషన్‌లోనే ఉంటాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన వినేశ్‌ తెలిపింది. ఆమె వ్యక్తిగత కోచ్‌ వోలర్‌ అకోస్‌ బెల్జియంలోనే ఉండటంతో కోచ్‌ ఓం ప్రకాశ్‌ దహియా ఆధ్వర్యంలో ఆమె ప్రాక్టీస్‌ చేసింది. శిక్షణా సమయంలో కరోనా బారిన పడిన దహియా ఆగస్టు 29న ‘ద్రోణాచార్య’ అవార్డును అందుకోలేకపోయాడు. అథ్లెట్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా మంగళవారం నుంచి లక్నోలో జరగాల్సిన మహిళల రెజ్లింగ్‌ శిబిరాన్ని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) వాయిదా వేసింది. పురుషుల శిబిరంలో సోనెపట్‌లో జరుగుతోంది. 

మరిన్ని వార్తలు