World Wrestling Championship 2022: చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌

15 Sep, 2022 08:11 IST|Sakshi

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్‌

రెండు పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు  

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు భారత్‌ ఖాతాలో తొలి పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్‌ 53 కేజీల విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ కాంస్య పతకంతో మెరిసింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా 28 ఏళ్ల వినేశ్‌ రికార్డు నెలకొల్పింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ వినేశ్‌ కాంస్య పతకం సాధించింది.

బుధవారం జరిగిన 53 కేజీల కాంస్య పతక బౌట్‌లో బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత వినేశ్‌ 8–0 పాయింట్ల తేడాతో ఎమ్మా జోనా మాల్మ్‌గ్రెన్‌   (స్వీడన్‌)పై గెలిచింది. వాస్తవానికి మంగళవారం వినేశ్‌ తొలి రౌండ్‌లో 0–7తో ఖులాన్‌ బత్కుయగ్‌ (మంగోలియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. అయితే ఖులాన్‌ ఫైనల్‌ చేరడంతో ‘రెపిచాజ్‌’ పద్ధతి ప్రకారం వినేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లభించింది.

ఫైనల్‌ చేరిన రెజ్లర్‌ చేతిలో అంతకుముందు రౌండ్‌లలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్‌’ పద్ధతి ద్వారా బౌట్‌లు నిర్వహిస్తారు. ‘రెపిచాజ్‌’ తొలి రౌండ్‌లో వినేశ్‌ 4–0తో జుల్‌దిజ్‌ ఇషిమోవా (కజకిస్తాన్‌)పై గెలిచింది. తదుపరి రౌండ్‌లో వినేశ్‌తో పోటీపడాల్సిన లేలా గుర్బనోవా (అజర్‌బైజాన్‌) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్‌కు ‘వాకోవర్‌’ లభించి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.  

కాంస్యం రేసులో నిషా 
మరోవైపు 68 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ నిషా దహియా కాంస్య పతకం రేసులో నిలిచింది. సెమీఫైనల్లో నిషా 4–5తో అమీ ఇషి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్‌లో నిషా 11–0తో దనుతె దొమికైతె (లిథువేనియా)పై, రెండో రౌండ్‌లో 13–8తో అదెలా హంజ్లికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 11–0తో సోఫియా (బల్గేరియా)పై గెలిచింది. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సరిత మోర్‌ (57 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 0–7తో లిసాక్‌ అన్‌హెలినా (పోలాండ్‌) చేతిలో... మాన్సి అహ్లావత్‌ క్వార్టర్‌ ఫైనల్లో 3–5తో జోవితా మరియా (పోలాండ్‌) చేతిలో... రితిక తొలి రౌండ్‌లో 2–6తో కెండ్రా అగస్టీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయారు.  

మరిన్ని వార్తలు