Vinod Kambli: వినోద్‌ కాంబ్లీ దీనావస్థ.. లక్ష జీతంతో జాబ్‌ ఆఫర్‌

23 Aug, 2022 19:44 IST|Sakshi

సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ కొద్ది రోజుల క్రితం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీఏ)కు ఏదైనా పని కల్పించాలని అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం తనకు బీసీసీఐ ఇచ్చే రూ.30వేల పెన్షన్‌ మాత్రమే ఆధారమని ఆ సమయంలో వెల్లడించాడు. అయితే ఎంసీఏ దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపారవేత్త సహ్యాద్రి ఇండస్ట్రీ గ్రూప్‌లోని ఫైనాన్స్‌ విభాగంలో వినోద్‌ కాంబ్లీకి నెలకు రూ.1లక్ష జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే కాంబ్లీ ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా, లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. 

కాగా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంబ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించడంలో విఫలమయ్యాడు. టీమిండియాకు 17 టెస్టులు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. కాంబ్లీ 2000లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. అయితే చాలా కాలం తర్వాత 2011లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అనంతరం క్రికెట్‌ కామెంటర్‌గా మారాడు. అనేక మీడియా ఛానల్‌లలో పనిచేశారు.

కాంబ్లీ కష్టాల్లో ఉన్నప్పుడు సచిన్‌ ఎన్నో విధాలుగా సాయపడ్డారు. అయితే, కొద్దిరోజుల క్రితం వరకు తన సహచరుడు సచిన్‌ టెండూల్కర్‌ ఏర్పాటు చేసిన అకాడమీలో కోచ్‌గా పనిచేసినా, ప్రయాణం చాలా దూరం కావడంతో అక్కడ ఉద్యోగం​ మానేసినట్లు కాంబ్లీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఉద్యోగం కల్పించాలని ఎంసీఏను అభ్యర్థించిన సంగతి తెలిసిందే.

చదవండి: (ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. సచిన్‌ సహచరుడు వినోద్‌ కాంబ్లీ దీనావస్థ..!)

మరిన్ని వార్తలు