Roger Federer: చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్‌.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు

9 Aug, 2022 15:51 IST|Sakshi

2017వ సంవత్సరం.. స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు వచ్చిన ఆ గుంపులోనే అమెరికాకు చెందిన ఆరేళ్ల ఇజ్యాన్‌ అహ్మద్‌(ముద్దుపేరు జిజౌ) కూడా ఉన్నాడు. జిజౌ.. ఫెదరర్‌కు వీరాభిమాని. ఆరేళ్ల వయసులోనే టెన్నిస్‌పై ప్రేమను పెంచుకున్నాడు. ఫెదరర్‌ ఆటను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ సందర్భంగా ఇజ్యాన్‌ అహ్మద్‌(జిజౌ) ఫెదరర్‌కు ఒకే ఒక్క ప్రశ్న వేశాడు.

''మీరు నాకోసం మరో ఎనిమిది, తొమ్మిదేళ్లు టెన్నిస్‌​ ఆడగలరా.. అలా అయితే మీతో కలిసి ఒక మ్యాచ్‌ ఆడాలని అనుకుంటున్నా?'' అని అడిగాడు. జిజౌ ప్రశ్న విన్న ఫెదరర్‌ చిరునవ్వుతో ''నాకు ఓకే'' అనే సమాధానం ఇచ్చాడు. వెంటనే జిజౌ.. ''నిజంగా ఆడుతారు కదా.. ప్రామీస్‌ చేస్తున్నారు.. మాట తప్పకూడదు'' అని పేర్కొన్నాడు.


2017లో ఫెదరర్‌తో ఆరేళ్ల జిజౌ(ఇజ్యాన్‌ అహ్మద్‌)

కట్‌చేస్తే.. ఆగస్టు 8, 2022.. ఐదేళ్ల తర్వాత జిజౌ కోరిక తీరిపోయింది. రోజర్‌ ఫెదరర్‌ 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టెన్నిస్‌లో మరిన్ని మెళుకువలు నేర్చుకునే క్రమంలో​ ట్రెయినింగ్‌ తీసుకునేందుకు తన కోచ్‌తో కలిసి జ్యూరిచ్‌కు వచ్చాడు. అయితే ఆ ట్రెయినింగ్‌ అకాడమీ ప్లాన్‌ వెనుక ఉన్నది ఎవరో కాదు.. మన రోజర్‌ ఫెదరరే. ఈ విషయం జిజౌకు తెలియదు. కానీ ఫెదరర్‌ మాత్రం గత ఐదేళ్ల నుంచి జిజౌను ఫాలో అవుతూ అతని గురించి తెలుసుకుంటూ వచ్చాడు.

ఇక ట్రెయినింగ్‌ జరగనున్న శిబిరంలో ఉన్న క్లబ్‌ క్యాంటీన్‌కు జిజౌ తన కోచ్‌తో కలిసి తినడానికి వచ్చాడు. ఇంతలో క్లబ్‌ ఉద్యోగి వచ్చి.. మా మేనేజర్‌ మీకు పెద్ద ఫ్యాన్‌.. మీతో సెల్ఫీ దిగాలని ఆశపడుతోంది అంటూ పేర్కొన్నాడు. దీనికి ఆశ్చర్యపోయిన జిజౌ.. ''నాతో సెల్ఫీ ఏంది.. నిజమేనా అని'' అనుకుంటూనే సరే అన్నాడు. ఇంతలో క్లబ్‌ మేనేజర్‌ వచ్చి తన షర్ట్‌ విప్పగానే లోపల ఉన్న టీషర్ట్‌పై జిజౌ బొమ్మ కనబడింది. అంతే షాక్‌కు గురైన జిజౌ.. సంతోషంతో ఉబ్బితబ్బియ్యాడు. అయితే ఇదంతా ఫెదరర్‌ ముందే ప్లాన్‌ చేసి పెట్టుకున్నాడని మన జిజౌకు తెలియదు.

ఆ తర్వాత ఇదంతా గమనించిన తోటీ ప్లేయర్లు.. జిజౌ.. జిఔ అని గట్టిగా అరవడం కనిపించింది. ఇదంతా రోజర్‌ ఫెదరర్‌ మానిటర్‌ కెమెరాలో పరిశీలిస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఆ తర్వాత క్లబ్‌లోని ఒక స్టాఫ్‌ మెంబర్‌ వచ్చి జిజౌను క్లే కోర్టుకు తీసుకెళ్లారు. ఇక్కడున్న యంగ్‌స్టర్స్‌ అంతా మీ ఆటను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే నీ ప్రత్యర్థి విలువ నువ్వు వెలకట్టలేనిది.. అదే ఈ సర్‌ప్రైజ్‌ అంటూ..''రోజర్‌ ఫెదరర్‌''ను ప్రవేశపెట్టారు. అంతే.. ఇజ్యాన్‌ అహ్మద్‌(జిజౌ) నోటి నుంచి మాట రాలేదు. చూస్తున్నది నిజామా కలా అన్నట్లుగా కాసేపు అలాగే ఉండిపోయాడు.

అయితే వెంటనే ఫెదరర్‌ జిజౌ వద్దకు వచ్చి.. '' నీ కల ఈరోజుతో నెరవెరబోతుంది.. పదా ఇద్దరం కలిసి ఒక మ్యాచ్‌ ఆడుదాం.'' అని పేర్కొన్నాడు. ఐదేళ్ల క్రితం తనకిచ్చిన మాటను 20 గ్రాండ్‌స్లామ్‌ విజేత ఫెదరర్‌ నిలబెట్టుకున్నాడన్న సంతోషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత 41 ఏళ్ల ఫెదరర్‌తో కలిసి జిజౌ మ్యాచ్‌ ఆడాడు. జిజౌ ఆడిన కొన్నిషాట్లు ఫెదరర్‌ ఆటను పోలి ఉన్నాయి. దీంతో ''నా ఆటను నేనే అద్దంలో చూసుకున్నట్లుగా ఉంది.'' అని ఫెదరర్‌ పేర్కొనడం విశేషం.

అయితే మ్యాచ్‌లో ఇద్దరి స్కోర్లు ఎంతనేది రివీల్‌ చేయనప్పటికి.. ఆఖర్లో ఫెదరర్‌, జిజౌలు పాస్తా ఆర్డర్‌ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ తినడం కనిపించింది. ఇక చివర్లో ఫెదరర్‌, జిజౌతో పాటు ట్రెయినింగ్‌కు వచ్చిన మిగతా పిల్లలు ఫోటోలకు ఫోజిచ్చారు. కాగా ఈవెంట్‌ను మొత్తం ఇటాలియన్‌ ఫుడ్‌ కంపెనీ బరిల్లా తన యూట్యూబ్‌ చానెల్‌లో వీడియో రూపంలో విడుదల చేసింది.


చదవండి: MS Dhoni: చెస్‌ ఒలింపియాడ్‌కు ఎంఎస్‌ ధోని.. అక్కడేం పని!

 11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు

మరిన్ని వార్తలు