Viral Video: వేలం సందర్భంగా సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్‌ ధర..!

14 Feb, 2022 20:28 IST|Sakshi

ఐపీఎల్ 2022 మెగా వేలం రెండో రోజు(ఫిబ్రవరి 13) స‌ందర్భంగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫ్రాంచైజీ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర వింత ప్రవర్తన పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంగ్లండ్‌ ఆటగాడు జోఫ్రా అర్చర్‌కు సంబంధించి లైవ్‌ అక్షన్‌ జరుగుతుండగా సంగక్కర ప్రవర్తించిన తీరుపై ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రత్యర్ధి జట్లకు సైగలు చేస్తూ.. ఆర్చర్‌ ధర అమాంతంగా పెరిగిపోయేలా చేసిన సంగక్కర చీటింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని సోషల్‌మీడియా కోడై కుస్తుంది. ఇందుకు త‌గిన ఆధారాలు కూడా ల‌భించడంతో అభిమానులు సంగ‌క్క‌రపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దిగ్గ‌జ ఆట‌గాడిగా బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా ప్రవర్తించడమేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్  మెగా వేలం రెండో రోజు ఆస‌క్తిక‌రంగా సాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌ విభాగంలో వేలంలోకి వ‌చ్చాడు. అయితే, ఆర్చర్‌ ఈ సీజన్‌లో ఆడడని తెలిసి కూడా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ జట్లు అతని కోసం పోటీ ప‌డటం మొదలెట్టాయి. వేలంలో ఆర్చర్‌ ధర 6 కోట్ల వ‌ద్ద‌కు రాగానే రాజ‌స్థాన్‌ పాకెట్‌లో డబ్బులు అయిపోవడంతో ఆ ఫ్రాంచైజీ డైరెక్ట‌ర్ కుమార సంగ‌క్క‌ర చీటింగ్‌కు పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తమకు దక్కని ఆర్చర్‌కు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ముంబై ఇండియ‌న్స్‌తో పోటీ పడాలని స‌న్ రైజ‌ర్స్‌కు సైగలు చేశాడు సంగక్కర. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారడంతో సంగక్కరపై ముప్పేట దాడి మొదలైంది. బాధ్యతాయుత‌మైన ప‌ద‌విలో ఉండి చీటింగ్ పాల్పడటానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సంగ‌క్క‌ర‌పై ఐపీఎల్ పాలక మండలి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, అర్చర్‌ విషయంలో పట్టువదలని ముంబై ఇండియన్స్‌ అతన్ని 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అతడు ఐపీఎల్‌ 2022 సీజన్‌కు అందుబాటులో ఉండడని తమకు తెలుసని, బుమ్రా- ఆర్చర్‌ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుందని భావించి, వచ్చే ఏడాది కోసమే ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం వివరణ ఇవ్వడం కొసమెరుపు. 
చదవండి: IPL 2022: మిశీ భాయ్‌, నీ సేవలకు సలాం.. ఢిల్లీ జట్టు ఎప్పటికీ నీదే..!

మరిన్ని వార్తలు