అదే నాకు కోహ్లి చెప్పాడు: సిరాజ్‌

4 Mar, 2021 20:45 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో చివరిదైన నాల్గో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మెరిశాడు. జో రూట్‌, బెయిర్‌ స్టోలను ఎల్బీగా ఔట్‌ చేసి బౌలింగ్‌లో సత్తా చాటాడు. ఈ ఇద్దరికి తక్కువ ఎత్తులో బంతులు వేసిన సిరాజ్‌.. వారిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి రోజు ఆట తర్వాత సిరాజ్‌ మాట్లాడుతూ.. ఇదొక బ్యాటింగ్‌ వికెట్‌ అని, తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ను తొలి రోజు ఆలౌట్‌ చేశామన్నాడు. ఎంతో సహనంతో ఓపిగ్గా బౌలింగ్‌ వేసి ఇంగ్లండ్‌పై పైచేయి సాధించామన్నాడు. ‘ ఇది బ్యాటింగ్‌ వికెట్‌. బ్యాట్‌పైకి బంతి మంచిగా వస్తుంది. కానీ బౌలింగ్‌లో మా వ్యూహాలు అమలు చేసి ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేశాం. పదే పదే ఒకే స్పాట్‌లో బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడి వికెట్లు సమర్పించుకున్నారు.

నాకు కోహ్లి భయ్యా ఒకటే చెప్పాడు. ఫాస్ట్‌ బౌలర్లు ఇద్దరే ఉన్న సంగతిని గుర్తుచేశాడు. మీ ఇద్దరూ(ఇషాంత్‌) ఫాస్ట్‌ బౌలింగ్‌ రొటేట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. నేను రిలయన్స్‌ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేయడం ప్రారంభించా. అదనపు బౌన్స్‌ రావడాన్ని గమనించా. ఇది బౌలర్లకు లాభిస్తుందని అనుకున్నా. నేను ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కానీ  ఇక్కడ ఆడుతున్నప్పుడు కానీ ప్రతీ బంతిని వంద శాతం కచ్చితత్వంతో వేయాలనే చూస్తున్నా. నేను నా ప్రణాళిక అమలు చేసినప్పుడు అది ఒత్తిడి నుంచి బయటపడటానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు కూడా నా ప్లాన్‌ను అమలు చేశా. ఇక స్టోక్స్‌ నాతో వాగ్వాదానికి దిగినప్పుడు కోహ్లి హ్యాండిల్‌ చేసిన విధానం బాగుంది’ అని సిరాజ్‌ తెలిపాడు.

వారిద్దర్నీ ప్లాన్‌ చేసి ఔట్‌ చేశా..
ఇక రూట్‌, బెయిర్‌ స్టోలను ఔట్‌ చేయడం ఒక వ్యూహం ప్రకారమే జరిగిందన్నాడు. ‘ రూట్‌ కోసం ప్రత్యేకంగా అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ వేయాలని ప్లాన్‌ చేశా. అలా చేసి ఒక బంతిని ఇన్‌స్వింగర్‌గా వేయాలనుకున్నా. ఈ వ్యూహం ఫలించింది. ఇక బెయిర్‌ స్టోకు ఔట్‌ చేయడానికి అతనికి సంబంధించి కొన్ని వీడియోలు చూశా. ఇన్‌స్వింగ్‌కు ఔటయ్యే విషయాన్ని గ్రహించా. అదే లెంగ్త్‌తో బంతులు వేసి సక్సెస్‌ అయ్యా’ అని తెలిపాడు. 

ఇక్కడ చదవండి: ఆ హీరోయిన్‌ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా?

నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్‌ మధ్య వాగ్వాదం!

మరిన్ని వార్తలు