Virat Kohli: కోహ్లిని ఖుషి చేయాలనుకుంటున్న బీసీసీఐ.. వందో టెస్ట్‌ కోసం భారీ ఏర్పాట్లు..!

2 Feb, 2022 16:14 IST|Sakshi

టీమిండియా కెప్టెన్సీ అంశం కారణంగా ఇటీవలి కాలంలో బీసీసీఐ-కోహ్లిల మధ్య భారీ గ్యాప్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ గ్యాప్‌ను కవర్‌ చేసి, కోహ్లిని ఖుషి చేసేందుకు బీసీసీఐ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కోహ్లి 100వ టెస్ట్‌ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. 

త్వరలో శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌లో కోహ్లి తన 100వ టెస్ట్‌ మ్యాచ్‌ను ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను పింక్‌ బాల్‌ టెస్ట్‌(డే అండ్ నైట్ టెస్ట్)గా మార్చి కోహ్లి కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయేదిగా మలచాలని ప్లాన్‌ చేస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు జాతీయ వార్తా సంస్థతో చెప్పినట్లు సమాచారం. 

కాగా, ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో లంకేయులు టీమిండియాతో 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వరకు బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌.. కోహ్లికి వందో టెస్ట్‌ మ్యాచ్‌ కానుంది. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ముగిశాక లంకతో సిరీస్‌ మొదలుకానుంది. 

మరోవైపు భారత పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చేయాలని లంక క్రికెట్‌ బోర్డు ఇటీవల బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా తొలుత టెస్ట్‌ సిరీస్‌ కాకుండా టీ20లను నిర్వహించాలని ఎస్‌ఎల్‌సీ.. బీసీసీఐని రిక్వెస్ట్‌ చేసింది. ఈ విషయమై భారత క్రికెట్‌ బోర్డు స్పందించాల్సి ఉంది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం.. లంకతో సిరీస్‌లో ఫిబ్రవరి 25న తొలి టెస్ట్‌(బెంగళూరు), మార్చి 5న రెండో టెస్ట్‌(మొహాలి), మార్చి 13, 15, 18 తేదీల్లో 3 టీ20లు జరగాల్సి ఉన్నాయి.
చదవండి: 'ఆరంభానికి ముందు ఈ నిరీక్షణ తట్టుకోలేకపోతున్నా'

మరిన్ని వార్తలు