Sourav Ganguly: కోహ్లి వందో టెస్ట్‌ కోసం భారీ ఏర్పాట్లు.. కన‍్ఫర్మ్‌ చేసిన బీసీసీఐ బాస్‌

3 Feb, 2022 15:44 IST|Sakshi

టీమిండియా కెప్టెన్సీ అంశం కారణంగా బీసీసీఐ-కోహ్లిల మధ్య గ్యాప్‌ వచ్చిందన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ బాస్‌ గంగూలీ వాటికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో  భాగంగా కోహ్లి 100వ టెస్ట్‌ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చి, తమ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతాలు పంపడంతో పాటు కోహ్లిని వ్యక్తిగతంగా ఖుషీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. 

శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే టెస్ట్‌ సిరీస్‌లో కోహ్లి తన వందో టెస్ట్‌ మ్యాచ్‌ను ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను పింక్‌ బాల్‌ టెస్ట్‌(డే అండ్ నైట్ టెస్ట్)గా మార్చి కోహ్లి కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయేదిగా మలచాలని గంగూలీ స్కెచ్‌ వేశాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఫిబ్రవరి 25న బెంగళూరు వేదికగా జరగాల్సిన టెస్ట్‌ మ్యాచ్‌ కోహ్లికి వందో టెస్ట్‌ కానుంది. ఈ మ్యాచ్‌ను సకల హంగూ ఆర్భాటాలతో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఇదిలా ఉంటే, విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ అనంతరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో లంకేయులు టీమిండియాతో 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 25న తొలి టెస్ట్‌(బెంగళూరు), మార్చి 5న రెండో టెస్ట్‌(మొహాలి), మార్చి 13, 15, 18 తేదీల్లో 3 టీ20లు జరగాల్సి ఉన్నాయి. అయితే, ఒక్క బెంగళూరు టెస్ట్‌ మినహా మిగతా షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని గంగూలీ సూచనప్రాయంగా వెల్లడించాడు. దేశంలో కోవిడ్‌ పరిస్థితులు అలాగే షెడ్యూల్‌లో మార్పుపై లంక క్రికెట్‌ బోర్డు అభ్యర్ధనను పరిగణలోకి తీసుకుని త్వరలో అప్‌డేటెడ్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తారని తెలుస్తోంది. 
చదవండి: IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ అక్కడే: గంగూలీ

మరిన్ని వార్తలు