Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్‌ చేస్తే 99 శాతం లిఫ్ట్‌ చేయడు.. అలాంటిది..

26 Feb, 2023 08:08 IST|Sakshi
కోహ్లి, ధోని (PC: ANI)

Virat Kohli- MS Dhoni: తాను ఫామ్‌ కోల్పోయి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటునప్పుడు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మాత్రమే తనకు అండగా నిలిచాడని టీమిండియా స్టార్‌ క్రికెటర్‌  విరాట్‌ కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ‘రెండుసార్లు ధోని మెసేజ్‌ చేసి అలాంటి సమయంలో ఎలా దృఢంగా ఉండాలో చెప్పాడు’ అని అన్నాడు. ధోనితో దాదాపు పదకొండేళ్ల పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకున్న కోహ్లి మిస్టర్‌ కూల్‌తో తన అనుబంధం గురించి తాజా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు.

‘‘ఆయన ఎవరితోనైనా టచ్‌లో ఉండటం చాలా అరుదు. ఎప్పుడోసారి ఆయనకు నేను కాల్‌ చేశాననుకోండి.. 99 శాతం ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. ఎందుకంటే అసలు ఆయన ఫోన్‌ వైపు చూస్తేనే కదా! అలాంటి వ్యక్తి నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తనంతట తాను రెండుసార్లు నాకు మెసేజ్‌ చేశాడు.

నువ్వు మరింత దృఢంగా మారాలి అనుకుంటే.. అలాంటి వ్యక్తులు ఎవరున్నారో ఒక్కసారి వాళ్లను గుర్తుచేసుకో. నీ ఆలోచనా విధానం మారిపోతుంది అని చెప్పాడు. ధోని ప్రతి అంశాన్ని చూసే కోణం ఇలాగే ఉంటుంది. అందుకే తను అలా ఉండగలుగుతాడు. నాకూ అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు.

తన వ్యక్తిగత జీవితంలో, కెరీర్‌లో ధోని కూడా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అందుకే ఇతరుల మానసిక స్థితి ఎలా ఉందో అంచనా వేయగలడు. గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మార్గదర్శనం చేయగలడు’’ అని కోహ్లి ధోని వ్యక్తిత్వం, ఆలోచనా విధానం గురించి చెప్పుకొచ్చాడు. 

ధోనితో ప్రత్యేక అనుబంధం
కాగా ధోని సారథ్యంలోనే కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. కెప్టెన్‌ నమ్మకాన్ని చూరగొని.. అతడి వారసుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. ధోని మద్దతుతోనే కోహ్లి టీమిండియా కెప్టెన్‌ అయ్యాడన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇదిలా ఉంటే... కెప్టెన్సీ కోల్పోవడం, స్థాయికి తగ్గట్లు రాణించలేక, నిలకడలేమి ఫామ్‌తో కొన్నాళ్ల క్రితం వరకు కోహ్లి సతమతమైన విషయం తెలిసిందే. కపిల్‌దేవ్‌ వంటి దిగ్గజాలు సహా పలువురు మాజీలు కోహ్లి కెరీర్‌కు ముగింపు దశకు వచ్చిందన్నట్లుగా కామెంట్లు చేశారు. అలాంటి సమయంలో ధోనితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కోహ్లి పెట్టిన పోస్టు అప్పట్లో వైరల్‌ అయింది. తాజాగా ఆ పోస్టు గురించి కోహ్లి పరోక్షంగా స్పందించాడు.

ఇక ఆసియా టీ20 టోర్నీ ద్వారా కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించిన కోహ్లి.. మరో రెండు శతకాలు బాది పూర్వవైభవం పొందాడు. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌-2023 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. విరాట్‌ కోహ్లి తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలు పంచుకున్నాడు.

అత్యాశ లేదు
కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించినా... ఐసీసీ ఈవెంట్లకు వచ్చేసరికి మాత్రం విరాట్‌ కోహ్లికి ఏదీ కలిసి రాలేదు. నాలుగు ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్‌ (2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీస్, 2021 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్, 2021 టి20 వరల్డ్‌ కప్‌ లీగ్‌దశ) మ్యాచ్‌లలో టీమిండియా ఓటమి పాలైంది.

దాంతో ఒక్క ఐసీసీ టోర్నీ విజయం కూడా లేకుండానే కోహ్లి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్‌ చేరినా సరే తనపై విఫల కెప్టెన్‌ ముద్ర పడిందని కోహ్లి తాజాగా వ్యాఖ్యానించాడు.

బాధపడే రకం కాదు
‘టోర్నమెంట్‌లు గెలవడం కోసమే మనం ఆడతాం. అయితే నాలుగు ఐసీసీ టోర్నీలలో ప్రదర్శనను బట్టి నన్ను విఫల కెప్టెన్‌గా పరిగణించారు. నేను విజయాలు మాత్రమే అనే కోణంలో ఆలోచించలేదు. కొన్నిసార్లు ఫలితాలకంటే జట్టును తీర్చిదిద్దడం ముఖ్యం. ఆటగాడిగా నేను వరల్డ్‌ కప్, చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన జట్టు సభ్యుడిగా ఉన్నా.

ఐదుసార్లు టెస్టు గద అందుకున్న టీమ్‌లోనూ భాగంగా ఉన్నా. అసలు ఏనాడూ ప్రపంచకప్‌ గెలవని వారూ ఉన్నారనే విషయం మరచిపోవద్దు. నేను గెలిచిన వాటి గురించి సంతోషిస్తున్నా తప్ప ఓడినవి గుర్తు చేసుకొని బాధపడే రకం కాదు. అన్ని ట్రోఫీలు ఇంట్లో ఉండాలనే అత్యాశ లేదు ’ అని కోహ్లి చెప్పాడు. 

చదవండి: ENG vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం
IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. భారీ రికార్డుపై కన్నేసిన అశ్విన్‌!

మరిన్ని వార్తలు