కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే

14 Nov, 2020 04:58 IST|Sakshi

ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ వ్యాఖ్య

మెల్‌బోర్న్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీ టెస్టు సిరీస్‌ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్‌లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు.

ఈ నేపథ్యంలో ఆసీస్‌ హెడ్‌కోచ్‌ లాంగర్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్‌ కోసం కష్టపడే తత్వం, ఫిట్‌నెస్‌ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్‌లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు.

ఆటగాళ్లు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్‌ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్‌ను ఓడించిన భారత్‌ను విరాట్‌ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్‌కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్‌ పూర్తవగానే నవంబర్‌ 27న తొలి వన్డే ఆడుతుంది.

మరిన్ని వార్తలు