వైరల్‌: బట్లర్‌ తీరుపై కోహ్లి ఆగ్రహం

21 Mar, 2021 12:35 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య శనివారం జరిగిన ఐదో టీ20లో విరాట్‌ కోహ్లి, జోస్ బట్లర్‌ల మధ్య కొన్ని సెకన్ల పాటు మాటల యుద్ధం చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో భువనేశ్వర్‌ వేసిన బంతిని బట్లర్‌ లాంగాఫ్‌లోకి షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఉన్న హార్దిక్‌ పాండ్యా దానిని క్యాచ్‌ తీసుకోవడంతో 54 పరుగులు చేసిన బట్లర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. కీలక వికెట్‌ తీశామన్న ఆనందంలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ సంబురాల్లో మునిగిపోయారు.

అయితే తాను ఔటయ్యాననే బాధను జీర్ణించుకోలేక బట్లర్‌ కోహ్లిని చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోహ్లి సీరియస్‌గా మారి బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనివైపు దూసుకొచ్చాడు. బట్లర్‌ పెవిలియన్‌కు వెళుతూ మరోసారి కోహ్లి వైపు తిరిగి చూడగా.. కోహ్లి కూడా అతనికి ధీటుగానే బదులివ్వడం.. ఆ తర్వాత బట్లర్‌ వెళ్లిపోవడంతో వివాదం ముగిసింది. అనంతరం అంపైర్‌ నితిన్‌ మీనన్‌తో మాట్లాడిన కోహ్లి తనకు, బట్లర్‌ల మధ్య జరిగిన సంభాషణ గురించి చర్చించినట్లు తెలిసింది. ఈ వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

అయితే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే జేసన్‌ రాయ్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన మలాన్‌తో కలిసి రెండో వికెట్‌కు బట్లర్‌ 130 పరుగులు జోడించి విజయం వైపు నడిపించాడు.130 పరుగుల వద్ద బట్లర్‌  వెనుదిరగడంతో మ్యాచ్‌ టీమిండియా వైపు టర్న్‌ అయింది. ఇక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవరల్లో 2వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది . డేవిడ్‌ మలాన్‌ 68, బట్లర్‌ 52 మినహా మిగతావారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌ 36 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి:
కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి!

టీ20 వరల్డ్ కప్‌ విజేత ఆ జట్టే: మైకేల్‌ వాన్

మరిన్ని వార్తలు