ICC RANKINGS: రెండో ర్యాంక్‌ నిలబెట్టుకున్న కోహ్లీ

2 Jun, 2021 18:46 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్‌ పాయింట్లు ఉండగా, రోహిత్‌ ఖాతాలో 825 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 865 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బంగ్లా వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ 739 రేటింగ్‌ పాయింట్లు సాధించి 14వ స్థానానికి ఎగబాకాడు. 

ఇదిలా ఉంటే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో ప్లేస్‌కు దిగజారాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌ (725 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి రెండో ప్లేస్‌కు, మరో బంగ్లా బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (652) తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో బంగ్లా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 387 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌(121), ఆస్ట్రేలియా(118), భారత్‌(115), ఇంగ్లండ్‌(115) వరుసగా ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను..

మరిన్ని వార్తలు