Virat Kohli: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం

25 Jun, 2022 19:08 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌.. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి దూకుడుకు మారుపేరు. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా సందర్బాల్లో కోహ్లికి కోపం వస్తే మాములుగా ఉండదు అని నిరూపించాడు. తనను ఎవరైనా కామెంట్‌ చేస్తే ఊరుకోని కోహ్లి.. తన సహచర ఆటగాళ్ల విషయంలోనూ అంతే అగ్రెసివ్‌గా రియాక్ట్‌ అవుతుంటాడు. పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్... ఇలా ఏ ఆటగాడిని ట్రోల్ చేసినా ముందుకు దూసుకొచ్చి ప్రత్యర్థి జట్టుకి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇవ్వడం చేసేవాడు.

కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టును ఎంత దూకుడుగా నడిపించాడో.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అదే పంథాను అనుసరించాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 1న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్టు నేపథ్యంలో లీస్టర్‌షైర్‌తో టీమిండియా నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. కాగా ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం టీమిండియా నెట్‌బౌలర్‌గా కమలేశ్‌ నాగర్‌కోటి ఎంపికయ్యాడు. వార్మప్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కమలేశ్‌ నాగర్‌కోటికి ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. 

మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి పదేపదే కమలేశ్‌ను పిలిచే ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌ జరుగుతుండడంతో కమలేశ్‌ స్పందించలేదు. తనకు సెల్ఫీ ఇవ్వాలని.. ఫోటో తీసేంతవరకూ తనవైపు తిరగాలంటూ గోల చేస్తూ  ఇబ్బందిపెట్టాడు. ఇదంతా బాల్కనీ నుంచి గమనించిన కోహ్లి బయటికి వచ్చి ‘ఎందుకు అతన్ని విసిగిస్తున్నావ్’ అంటూ నిలదీశాడు. దానికి అతను తానేం విసిగించడం లేదని... ఫోటో ఇవ్వాలని అడుగుతున్నానంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.‘అతను మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాడు... నీకోసం కాదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మూడేళ్లుగా సెంచరీ కోసం తప్పిస్తున్న కోహ్లి కనీసం ఇంగ్లండ్‌ గడ్డపై ఆ ఫీట్‌ సాధిస్తాడేమో చూడాలి. ఈ మూడేళ్లలో వన్డేలు, టెస్టులు, టి20లు, ఐపీఎల్‌ ఇలా ఏవి ఆడినా సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా లీస్టర్‌షైర్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. 

చదవండి: కోహ్లి వికెట్‌పై లీస్టర్‌షైర్‌ బౌలర్‌ స్పందన

కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే..

>
మరిన్ని వార్తలు