కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ

25 Jun, 2021 21:00 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి 'మెషిన్‌ గన్‌' అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కోహ్లి బరిలో ఉ‍న్నాడంటే సెంచరీ చేసేదాకా ఔటయ్యేందుకు ఇష్టపడేవాడు కాదు. అందుకు తగ్గట్టుగానే తన బ్యాటింగ్‌ కొనసాగిస్తూ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా  సెంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ పోయాడు. ముఖ్యంగా సెంచరీల విషయంలో వన్డేల్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. ఇప్పటికే 43 వన్డే సెంచరీలు సాధించిన అతను సచిన్‌ (49 సెంచరీల)రికార్డుకు  మరో ఆరు సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇంతటి ఘనమైన రికార్డులు కలిగి ఉన్న విరాట్‌ కోహ్లి బ్యాట్‌ ఏడాదిన్నర నుంచి కళ తప్పింది. అతను సెంచరీ చేసి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది.


కోహ్లి చివరగా 2019 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ(114*)తో మెరిశాడు. అప్పటినుంచి మళ్లీ అతని బ్యాట్‌ నుంచి ఒక్క ఫార్మాట్‌లోనూ శతకం రాలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో కరోనా, లాక్‌డౌన్‌ కాలం తీసేస్తే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లు కలిపి 41 మ్యాచ్‌లు ఆడి 1703 పరుగులు చేశాడు. ఇందులో 8 టెస్టుల్లో 345 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 74, 15 వన్డేల్లో 649 పరుగులు.. అత్యధిక స్కోరు 89, ఇక చివరగా 18 టీ20ల్లో 709 పరుగులు చేసిన కోహ్లి 94* అత్యధిక స్కోరును సాధించాడు. మొత్తంగా 17సార్లు అర్థశతకాలను అందుకున్న కోహ్లి వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు.

ఇంకో విశేశమేమిటంటే 46 ఇన్నింగ్స్‌ల(అన్ని ఫార్మాట్లు) నుంచి ఒక్క శతకం లేకుండా ఉన్న కోహ్లి ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. దీనికి తోడు తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడంతో.. మేజర్‌ ఈవెంట్స్‌లో ఒక్క టైటిల్‌ గెలవకపోవడంతో అతని కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో '' కోహ్లి నీ సెంచరీ కోసం ఇంకా ఎన్నాళ్లు నిరీక్షించాలో'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


అయితే ఇలాంటి అనుభవాలే గతంలో తొలి టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు ఎదురైంది. విచిత్రమేంటంటే విలియమ్సన్‌కు 23 ఇన్నింగ్స్‌ల పాటు రెండేసీసార్లు(2012, 2015-16) సెంచరీ మార్క్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతనితో పాటు ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ 28 ఇన్నింగ్స్‌ల పాటు ఒక్క సెంచరీ నమోదు చేయలేదు.
చదవండి: ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ చాంపియనా: విరాట్‌ కోహ్లి

1983.. ఆ చరిత్రకు 38 ఏళ్లు

మరిన్ని వార్తలు