విశ్రాంతి లేదు.. వేగం పెంచాల్సిందే: కోహ్లి

30 Mar, 2021 13:29 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(ఫొటో కర్టెసీ: ఐపీఎల్‌టీ20.కామ్‌)

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2021 ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పలు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, భారత్‌లో బయో బబుల్‌లో జరిగే 14వ సీజన్‌కు సన్నద్ధమవుతున్నాయి. ఇక పలువురు భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ ముగించుకొని ఆ బబుల్‌ నుంచి ఐపీఎల్‌ బబుల్‌లోకి బదిలీకావడంతో కచ్చితమైన క్వారంటైన్‌ నిబంధన పాటించనవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో, డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇప్పటికే జట్టుతో కలిశారు.

మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం ఏప్రిల్‌ 1న ఆర్సీబీ జట్టుతో చేరనున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వర్కౌట్‌ వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు, టీ20, వన్డే సిరీస్‌ నేపథ్యంలో ఏమాత్రం అలుపెరుగక జట్టును ముందుండి నడిపించిన కోహ్లి.. ‘‘విశ్రాంతి లేదు. ఇక్కడి నుంచే వేగం పెంచాల్సిందే’’ అంటూ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు.. ఆర్సీబీ మరో స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిల్లియర్స్‌ సైతం.. ‘‘అన్నీ ప్యాక్‌ చేసుకున్నా. త్వరలోనే జట్టుతో చేరబోతున్నా’’ అని ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు చహల్, సిరాజ్‌ పుణేలో ఆఖరి వన్డే ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు