Virat Kohli Birthday Special: 'కింగ్‌' కోహ్లి.. కరగని శిఖరం

5 Nov, 2022 07:40 IST|Sakshi

విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా రన్‌ మెషిన్‌, చేజింగ్‌ మాస్టర్‌, కింగ్‌ కోహ్లి.. ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలియదు కానీ.. కోహ్లి లాంటి శిఖరం మాత్రం ఎన్నటికి కరగడు. వయస్సు పెరిగేకొద్ది తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తనని విమర్శించిన నోళ్లే ఇవాళ మెచ్చుకుంటున్నాయి. టి20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా తరపున కోహ్లి టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న కోహ్లి.. మరోసారి టి20 ప్రపంచకప్‌ అందించాలని ఉవ్విళ్లురుతున్నాడు. 

జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడేవాడు గొప్ప వ్యక్తి అవుతాడు అని తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. తనను GOAT అని పిలుస్తున్నా వాళ్లకు అలా పిలవొద్దని.. అందుకు నేను అర్హుడిని కాదంటూ పేర్కొని తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడు GOATగానే ఉంటావు కోహ్లి. క్రికెట్‌లో రికార్డుల రారాజుగా పేరు పొందిన కోహ్లి ఇవాళ 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లికి Happy Birthday.

15 ఏళ్ల వయసులో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు కోహ్లి.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌‌కి కెప్టెన్‌‌గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్‌‌ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరీర్ ని మలుపుతిప్పింది. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్‌ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్‌ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. 

2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో వంద పరుగులు సాధించిన తర్వాత, కోహ్లి టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు.సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్‌ ద్వారా మొదటిసారి వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కోహ్లి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.

తన ప్రతిభ చాటుతూ ఎంఎస్‌ ధోని తరువాత భారత క్రికెట్‌ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అతని సారధ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేదన్న అపవాదు తప్ప కెప్టెన్‌గా ఎన్నో సాధించాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు టి20 వరల్డ్‌కప్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఏడో స్థానంలో ఉన్న భారత జట్టును నెం.1 టీమ్‌గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు (40 టెస్టు విజయాలు) అందించిన భారత కెప్టెన్ విరాట్... బీసీసీఐతో విభేదాలతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీ పదవులు కూడా ఊడిపోయాయి. దీనికి తోడూ ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి బ్యాట్‌ ఒక్కసారిగా మూగపోయింది.  దాదాపు కోహ్లి బ్యాట్‌ నుంచి సెంచరీ వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇక కోహ్లి పని అయిపోయింది అన్న తరుణంలో బౌన్స్‌ బ్యాక్‌ అయిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో మెరిసినప్పటికి చిన్న జట్టు కదా ఇది మాములే అనుకున్నారు. కానీ కోహ్లి కెరీర్‌ ఇక్కడి నుంచి మరో మలుపు తీసుకుంది. తాను ఫామ్‌లోకి వచ్చానంటే నమ్మనివాళ్లు నమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు కోహ్లి. అందుకు సాక్ష్యం టి20 వరల్డ్‌కప్‌ 2022. ఈసారి కప్‌ గెలవడానికే ఆడుతున్నాడా అన్నట్లుగా కోహ్లి ఇన్నింగ్స్‌లు సాగుతున్నాయి. 

ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరపున లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా ఉన్న కోహ్లి విలువ గురించి చెప్పడానికి పాకిస్థాన్ మీద ఆడిన ఒక్క ఇన్నింగ్స్ చాలు. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో పడ్డ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లి. హారిస్ రవూఫ్ బౌలింగ్ లో ఆఖర్లో కొట్టిన రెండు సిక్సర్లు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాలు తెగే టెన్షన్ లో కూడా ఎంతో కూల్ గా టీమిండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకే సాధ్యమవుతుంది.

ఇక, ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే పేరు విరాట్ కోహ్లి. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతీ దేశం కలలు కంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్టుగా శతకాలు బాదుతూ పోయాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాది... మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు బాదాడు.

అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 8 వేలు, 9000, 10,000, 11 వేల మైలురాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 175 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ, 222 ఇన్నింగ్స్‌లో 11 వేల మైలురాయిని అందుకున్నాడు. ఈ దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్‌తో ఐసీసీ ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు గెలిచాడు... 2016 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. 

చదవండి: కోహ్లి కెరీర్‌లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు..

మరిన్ని వార్తలు