స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్‌

25 Feb, 2021 21:20 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘన విజయం ద్వారా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు కోహ్లి సారధ్యంలో స్వదేశంలో 29 టెస్టులాడిన టీమిండియా 22 విజయాలు సాధించింది. తాజాగా పింక్‌ బాల్‌ టెస్టు విజయంతో ధోనిని కోహ్లి అధిగమించాడు. కాగా ధోని సారధ్యంలో స్వదేశంలో టీమిండియా 21 విజయాలు సొంతం చేసుకుంది.

ఇక ఓవరాల్‌గా కోహ్లి సారధ్యంలో భారత్‌ ఇప్పటివరకు 59 టెస్టులాడి 35 విజయాలు సాధించింది. స్వదేశం, విదేశం కలుపుకొని టీమిండియాకు టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించి పెట్టిన కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కోహ్లి తర్వాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 21 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. కాగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు విజయంతో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌ వేదికలోనే జరగనుంది.
చదవండి: అద్భుత విజయం.. అగ్రస్థానంలో టీమిండియా
పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు

>
మరిన్ని వార్తలు