IND VS SL 3rd ODI: సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్‌ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?

16 Jan, 2023 15:32 IST|Sakshi

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం‍తో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్‌; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్‌ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు.

అదేంటంటే.. కింగ్‌ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు.

2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్‌.. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది.  

సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్‌ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్‌ ఉందంటే కింగ్‌కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు. 

కాగా, లంకపై సూపర్‌ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్‌లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. 

ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్‌ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం.

మరిన్ని వార్తలు