Virat Kohli:'కింగ్‌ కోహ్లి'.. మొన్న మెచ్చుకున్నారు.. ఇవాళ తిట్టుకుంటున్నారు

20 Aug, 2022 10:24 IST|Sakshi

టీమిండియా స్టార్‌.. రన్‌మెషిన్‌ విరాట్ కోహ్లి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ లేకుండానే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. బహుశా ఏ క్రికెటర్‌కు ఇలాంటి చెత్త రికార్డు లేదనుకుంటా. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకొని ''కింగ్‌ కోహ్లి'' అని పిలిపించుకున్న కోహ్లి ఇప్పడు మాత్రం సెంచరీ లేక అల్లాడిపోతున్నాడు. ఒక్క సెంచరీ కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. మరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసినట్లుగానే కోహ్లి కూడా సెంచరీ లేకుండా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం అతనికే సాధ్యమైంది.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

మొన్నటికి మొన్న అంతర్జాతీయ క్రికెట్‌లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లిని ఎవరైతే మెచ్చుకున్నారో.. ఇవాళ అదే నోటితో.. ''ఇంకెంతకాలం కోహ్లి.. సెంచరీ లేకుండా'' అని తిట్టుకుంటున్నారు. కోహ్లీ చివరి సారిగా  నవంబర్ 23, 2019న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 136 పరుగులు చేశాడు. అప్పట్నుంచి తన కెరీర్‌లో కోహ్లి ఎత్తుపల్లాలు చవిచూస్తూనే ఉన్నాడు.

ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 68  మ్యాచ్‌లలో ఆడాడు. 82 ఇన్నింగ్స్‌లలో 34.05 సగటుతో అన్ని ఫార్మాట్లలో 2,554 పరుగులు చేశాడు. అంతేకాదు 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. 2019లో  టెస్టుల్లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాక కోహ్లీ..18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌లలో 27.25 సగటుతో 872 పరుగులు చేశాడు. ఆరుసార్లు యాభై పరుగుల మార్కును దాటాడు.

ఇక చివరి సెంచరీ తర్వాత 23 వన్డేలు ఆడిన కోహ్లీ..35.82 సగటుతో 824 పరుగులు సాధించాడు. 89 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఈ ఫార్మాట్‌లో పది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు. ఇక 27 టీ20ల్లో  42.90 సగటుతో 858 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోరు 94*.  చివరి సెంచరీ తర్వాత టీ20ల్లో ఎనిమిది అర్ధ సెంచరీలు కొట్టాడు. కానీ శతకాన్ని మాత్రం కోహ్లీ సాధించలేకపోయాడు. 

ఆసియాకప్‌లోనైనా అందుకుంటాడా?
మరో వారం రోజుల్లో ఆసియా కప్‌ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లి సెంచరీ మార్క్‌ అందుకుంటాడని అంతా భావిస్తున్నారు. పైగా ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో(ఆగస్టు 28న) తొలి మ్యాచ్‌ ఆడనున్న తరుణంలో కోహ్లి కచ్చితంగా సెంచరీ చేస్తాడని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మెగా ఈవెంట్‌ కోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. క్రికెట్‌ దిగ్గజాలుగా పేరొందిన సచిన్‌, గావస్కర్‌, పాంటింగ్‌, ద్రవిడ్‌, గంగూలీ.. ఇలా అందరూ ఏదో ఒక దశలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి సెంచరీతో కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. కానీ కోహ్లిలా సెంచరీ లేకుండా వెయ్యి రోజులు మాత్రం ఎవరు లేరు.

మూడేళ్లలో ఒక్కసారి కూడా వెయ్యి పరుగుల మార్క్‌ లేకుండా..
2020, 2021, 2022లో కోహ్లీ అత్యంత చెత్తగా ఆడుతున్నాడని చెప్పొచ్చు. ఈ మూడేళ్లలో ఒక్క కాలెండర్ ఇయర్ లో కూడా  కోహ్లీ కనీసం ఒక్కసారి కూడా వెయ్యి పరుగుల మార్కును దాటలేకపోయాడు.  2019లో చివరి శతకం సాధించిన తర్వాత కోహ్లీ ఆ ఏడాది చివర్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు.  ఆరు ఇన్నింగ్స్‌లలో 68.00 సగటుతో 272 పరుగులు చేశాడు. బెస్ట్ స్కోరు 94* పరుగులు. మూడు అర్ధ సెంచరీలు కొట్టి..2019ని బాగానే ముగించాడు. 

2020లో కోహ్లీ 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 842 పరుగులు చేశాడు. ఇక 2021లో 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 964 పరుగులు సాధించాడు. ఇక ఏడాది ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడగా..19 ఇన్నింగ్స్‌లలో.. 25.05 సగటుతో 476 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 79 పరుగుల అత్యుత్తమ స్కోరు. ఇప్పటి వరకు కేవలం నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు.

చదవండి: Virat Kohli International Debut: 14 ఏళ్ల కెరీర్‌ పూర్తి.. కోహ్లి ఎమోషనల్

Virat Kohli: చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా!

మరిన్ని వార్తలు