జోన్స్‌ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే

24 Sep, 2020 18:29 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ కన్నుమూశారనే వార్త క్రికెట్‌ ప్రపంచాన్ని  కలవరానికి గురి చేసింది. ఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా ముంబైలో ఉండి బ్రాడ్‌కాస్టింగ్‌ కామెంటరీ అందిస్తున్న జోన్స్‌.. ఈ రోజు(గురువారం) మధ్యాహ్న ఒంటి గంట ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. గుండె పోటుకు గురైన జోన్స్‌ మృతి చెందడంపై క్రీడాలోకం ఘనంగా నివాళులు అర్పిస్తోంది. ప్రముఖ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌లతో పాటు టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌లు జోన్స్‌కు నివాళులు అర్పించారు. ఈ మేరకు తమ ట్వీట్ల ద్వారా సానుభూతి తెలిపారు.(చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

ఉదయం బానే ఉన్నారు..: ఇర్ఫాన్‌
‘జోన్స్‌ లేరనే వార్త షాక్‌కు గురి చేసింది. చాలా కలత చెందా.  ఆయన ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే  ఈ  చేదు వార్త వినాల్సి వచ్చింది. నేను రెండు రోజుల క్రితం జోన్స్‌ కుమారుడితో మాట్లాడా. అప్పటికి ఆయనకు ఎటువంటి సమస్య లేదు. అంతా నార్మల్‌గానే ఉంది. జోన్స్‌ మృతిచెందారనే వార్తను నమ్మలేకపోతున్నా’ అని ఇర్ఫాన్‌ సంతాపం వ్యక్తం చేశాడు.

షాక్‌కు గురయ్యా..: కోహ్లి
‘జోన్స్‌ చనిపోయారనే వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితులకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం’ అని కోహ్లి తన ట్వీట్‌లో సంతాపం తెలిపాడు.

మిమ్మల్ని మిస్సవుతున్నాం..: వార్నర్‌
‘ఈ వార్తను నమ్మలేకపోయా. చాలా బాధాకరం.  జోన్స్‌ ఆత్మకు శాంతి చేకూరాలి. డీయోనో.. నిన్ను మిస్సవుతున్నాం’ అని వార్నర్‌ ట్వీట్‌ చేశాడు.

అతని కామెంటరీని ఎంజాయ్‌ చేసేవాళ్లం: కైఫ్‌
జోన్స్‌ కామెంటరీనీ ఎంజాయ్‌ చేసేవాళ్లం.  మీ అసాధారణ బ్యాటింగ్‌, ప్రొఫెషనల్‌ అనాలిసిస్‌ ఎప్పుడూ అద్భుతమే. మిమ్మల్ని టీవీలో చూసే అవకాశాన్ని మిస్సవుత్నున్నాం. మీతో కలిసి క్రికెట్‌ విశ్లేషణ ఇక ఉండదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు