లేట్‌గా చెప్పినా లేటెస్ట్‌గా చెప్పాడు.. చానుకు ప్రత్యేక సందేశం పంపిన కోహ్లీ

26 Jul, 2021 19:12 IST|Sakshi

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. విశ్వక్రీడల వేదికపై భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించిన చానును ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. ఛాంపియన్‌ లేడీని విష్‌ చేయడంలో లేట్‌ అయినా.. లేటెస్ట్‌గా విష్‌ చేశాడు. చానుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేకమైన వీడియో క్లిప్‌ను విడుదల చేశాడు.

22 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్న రెండు ఫొటోలను జత చేశాడు. దేశభక్తిని రగిల్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కంపోజ్ చేశాడు. దేశ పౌరుల ఆశలను తన భుజాల మీద మోశారని ప్రశంసించాడు. ఒలింపిక్స్‌లో పతకాన్ని ముద్దాడాలనే ఆశయాలను చాను నిజం చేసి చూపించారని కొనియాడాడు. కోట్లాదిమంది ప్రజల భారాన్ని మోశారని ఆకాశానికెత్తాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్క భారత అథ్లెట్ గేమ్‌ను తప్పనసరిగా వీక్షించాలని భారతీయులకు విజ్ఞప్తి చేశాడు.

ఇదిలా ఉంటే, సిల్వర్‌ మెడల్‌ సాధించిన చానుకు ఇప్పుడు గోల్డ్ మెడ‌ల్ ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో బంగార పతకం సాధించిన  చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హు జిహుయికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందులో జిహుయి విఫ‌ల‌మైతే.. రెండో స్థానంలో ఉన్న చానుకి గోల్డ్ మెడ‌ల్ ద‌క్కుతుంది. కాగా, కొద్ది గంటల క్రితమే భారత్‌లో అడుగుపెట్టిన చానుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమెను అదనపు ఎస్పీగా నియమిస్తున్నట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బిరేన్‌ సింగ్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు