Virat Kohli: అప్పుడు ‘కెప్టెన్‌’కు ఏడాదికి 180 కోట్లు.. ఒక్కో పోస్టుకు 5 కోట్లు.. మరి ఇప్పుడు అంతే సంపాదనా?!

17 Jan, 2022 13:56 IST|Sakshi

Virat Kohli Quit Test Captaincy: టీమిండియా ‘కెప్టెన్‌’గా.. స్టార్‌ బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రన్‌మెషీన్‌గా పేరొందిన కింగ్‌ కోహ్లి బ్రాండ్‌ వాల్యూ కూడా ఎక్కువే. సంపన్న బోర్డుకు చెందిన సారథిగా అతడికి అభిమానుల్లో ఉన్న చరిష్మా దృష్ట్యా పలు వాణిజ్య సంస్థలు కోహ్లిని అంబాసిడర్‌ నియమించుకున్నాయి. ఇందుకు కోట్లలో పారితోషికం చెల్లిస్తున్నాయి. మరి.. ఇప్పుడు కింగ్‌ కోహ్లికి ‘కెప్టెన్‌’ అన్న ట్యాగ్‌ లేదు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తనకు తానుగా తప్పుకోగా.. వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. 

ఇక దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటు నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు.  బ్యాటర్‌గా కూడా కోహ్లి ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ ‘పరుగుల యంత్రం’ సెంచరీ చేసి ఎన్నాళ్లయ్యిందో!! మరి ఇప్పుడు కూడా కోహ్లి బ్రాండ్‌ వాల్యూ మునుపటిలాగే ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

ఏడాదికి 180 కోట్లు..
పారిశ్రామిక వర్గాల అంచనా ప్రకారం వివిధ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోహ్లి 2021 ఏడాదికి గానూ 180- 200 కోట్ల రూపాయల మేర ఆర్జించాడు. సుమారు 30 బ్రాండ్లకు ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న అతడు ఈ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి వల్ల సదరు కంపెనీలకు చేకూరిన ప్రయోజనాల గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. 

కానీ... అతడి క్రేజ్‌ను క్యాష్‌ రూపంలోకి మలచుకోవడంలో సదరు కంపెనీలు సఫలమయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కెప్టెన్‌గా వైదొలిగినా... ఆటగాడిగా కొనసాగుతానన్న కోహ్లి ప్రకటన కారణంగా ఇప్పుడప్పుడే అవి అతడితో బంధాన్ని తెంచుకోవు. ముందు కుదిరిన ఒప్పందాల పరంగానైనా కోహ్లితో కలిసి ముందుకు సాగాల్సిందే. కాబట్టి టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు కోహ్లికి వచ్చే నష్టమేమీ లేదు.

అతడి ఇమేజ్‌ వల్లే!
ఈ విషయాల గురించి స్పోర్టీ సెల్యూషన్స్‌ సీఈఓ ఆశిష్‌ చద్దా ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దూకుడైన ఆటగాడిగా కోహ్లికి ఉన్న క్రేజ్‌ కంపెనీలకు వరంలాంటిదే. తను భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ధోని చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరి అతడి బ్రాండ్‌ వాల్యూ తగ్గలేదు కదా. కోహ్లి విషయంలోనూ అంతే.

యువతరానికి కోహ్లి ఐకాన్‌ లాంటివాడు. తను టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తాడు. కాబట్టి కంపెనీలు అతడిని వదులుకునే అవకాశం లేదు’’ అని చెప్పుకొచ్చారు. మరో అనలిస్టు సంతోష్‌ దేశాయ్‌ మాట్లాడుతూ.. ‘‘కోహ్లికి ఉన్న అశేష అభిమానుల కారణంగా అతడు ఎండార్స్‌ చేసే కంపెనీలు కోట్లలో లాభాలు ఆర్జించాయి. ఇప్పుడు కూడా కోహ్లి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి బ్రాండింగ్‌లో అతడి హవా కొనసాగుతుంది’’అని అభిప్రాయపడ్డారు.

ఎండార్స్‌మెంట్ల ద్వారా కోహ్లి సంపాదన (అంచనా)

  • 2021లో ఎండార్స్‌మెంట్ల ద్వారా కోహ్లి సంపాదించిన మొత్తం: 179 కోట్ల రూపాయలు.
  • ఒక్కరోజు ఎండార్స్‌ చేయడానికి కోహ్లి ఫీజు: 7- 8 కోట్లు.
  • ఇప్పటి వరకు కోహ్లి దాదాపు 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు.
  • ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా కోహ్లి ఆర్జించే మొత్తం: 5 కోట్లు.
  • డఫ్స్‌ అండ్‌ ఫెల్‌‍్ప్స డేటా ప్రకారం కోహ్లి బ్రాండ్‌ వాల్యూ: 237.7 మిలియన్‌ డాలర్లు

చదవండి: India New Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా అతడే!.. అప్పుడే బీసీసీఐ ప్రకటన

మరిన్ని వార్తలు