Kohli Vs BCCI: కుంటిసాకులు చూపుతున్న బీసీసీఐపై ఫైర్‌ అవుతున్న కోహ్లి ఫ్యాన్స్‌

16 Dec, 2021 16:11 IST|Sakshi

Virat Kohli Vs Sourav Ganguly: గత కొంతకాలంగా భారత క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీమిండియాలో విరాట్‌ కోహ్లి ఒంటరి అయ్యాడన్న విషయం స్పష్టమవుతోంది. తొలుత కోహ్లిని.. టీ20 సారథ్య బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకునేలా చేసి, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీకి ఎసరు పెట్టిన బీసీసీఐ పెద్దలు.. ఇప్పుడు తామేమీ ఎరగము.. తప్పంతా కోహ్లిదే అన్నట్లుగా కామెంట్లు చేస్తుండటంపై కోహ్లి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పరిమిత​ ఓవర్ల ఫార్మాట్‌కు ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయంటూ కుంటిసాకులు చూపుతున్న బీసీసీఐకి మహిళా క్రికెట్‌లో ఏం జరుగుతోందో తెలియదా అంటూ ధ్వజమెత్తుతున్నారు.

భారత మహిళా జట్టులో టీ20 ఫార్మాట్‌కి హర్మాన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉంటే.. వన్డే, టెస్ట్‌లకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న విషయం గంగూలీ అండ్‌ కోకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళల క్రికెట్‌లో రాని సమస్యలు.. పురుషుల క్రికెట్‌లో వస్తాయా అంటూ నిలదీస్తున్నారు. గంగూలీ, జై షా ఉద్దేశపూర్వకంగానే కోహ్లిని టార్గెట్‌ చేశారని, అందుకు వైట్‌బాల్‌ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లుంటే సమస్యలొస్తాయని, కోహ్లి ఇంతవరకు ఐసీసీ ట్రోఫీని గెలవలేదని సాకులు చూపుతున్నారని ఫైరవుతున్నారు. కోహ్లిని గద్దె దించడంలో భాగంగానే ద్రవిడ్‌కు టీమిండియాహెడ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పజెప్పారని, రవిశాస్త్రి ఉండగా వారి పప్పులు ఉడకలేదని అంటున్నారు.

కోహ్లిపై సగటు అభిమానిలో నెగిటివిటీ పెంచి తనకు తానే ఆటకు వీడ్కోలు పలికేలా చేసే అవకాశాలు లేకపోలేదని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు తాను కోహ్లిని వారించానని బీసీసీఐ బాస్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం.. అలాంటిదేమీ లేదు, కెప్టెన్సీ విషయమై గంగూలీ అసలు తనను సంప్రదించనేలేదని, కేవలం గంటన్నర ముందే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయం చెప్పారని కోహ్లి ప్రెస్‌మీట్‌ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం.. అనంతరం బీసీసీఐ కోహ్లి వ్యాఖ్యలను తోసిపుచ్చడం అందరికీ తెలిసిందే. 
చదవండి: విరాట్‌ కోహ్లి సంచలన వాఖ్యలు ... గంగూలీ "నో కామెంట్స్"!

మరిన్ని వార్తలు