Virat Kohli: కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్‌

13 Mar, 2023 20:16 IST|Sakshi

టీమిండియా స్టార్‌.. కింగ్‌ కోహ్లి అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్‌ ఖవాజా, అలెక్స్‌ కేరీకి గిఫ్ట్‌ అందించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. ఆ తర్వాత కాసేపు వారిద్దరితో మాట్లాడి కెరీర్‌ పరంగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మొత్తానికి కోహ్లి మాత్రం అహ్మదాబాద్‌ టెస్టు హీరోగా నిలిచాడు. కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి ఆ కొరతను తీర్చుకోవడమే గాక తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టాడు. ఇక బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు.

ఇరుజట్లు కలిపి నలుగురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఉస్మాన్‌ ఖవాజా 180, గ్రీన్‌ 114 సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. విరాట్‌ కోహ్లి 186, శుబ్‌మన్‌ గిల్‌ 128 పరుగులు.. సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ట్రెవిస్‌ హెడ్‌ 90 పరుగుల వద్ద ఔటయ్యి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మార్నస్‌ లబుషేన్‌ 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మ్యాచ్‌లో 186 పరుగులు చేసిన కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. సిరీస్‌లో పోటాపోటీగా వికెట్లు తీసిన అశ్విన్‌, జడేజాలు సంయుక్తంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును పంచుకున్నారు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ మార్చి 17 నుంచి మొదలుకానుంది. తొలి వన్డే ముంబై వేదికగా మార్చి 17న జరగనుంది.

మరిన్ని వార్తలు