ధోని తెరపైకి తెచ్చాడు.. కోహ్లి పాటిస్తున్నాడు!

21 Mar, 2021 15:51 IST|Sakshi

అహ్మదాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని అప్పట్లో తెరపైకి తెచ్చిన ఓ నూతన సంప్రదాయాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లి కూడా కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి 3-2తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం  ట్రోఫీని అందుకున్న కెప్టెన్ విరాట్‌ కోహ్లీ దాన్ని నేరుగా తీసుకెళ్లి అరంగేట్రం ఆటగాడైన ఇషాన్ కిషన్ చేతికి అందించాడు. 

ధోనిని ఫాలో అవుతున్నకోహ్లీ
గతంలో సిరీస్ గెలిచిన సందర్భాల్లో ధోని  కూడా ఇలానే జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి చేతికి మొదట ట్రోఫీని అందించి, తాను పక్కకి వెళ్లి నిల్చునేవాడు. ఇప్పుడు కోహ్లి  కూడా అదే సంప్రదాయాన్నికొనసాగిస్తున్నాడు. వాస్తవానికి చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుది జట్టులో లేడు. కానీ.. రెండు, మూడు టీ20ల్లో ఆడిన ఇషాన్ కిషన్.. తన హిట్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి.. అంచనాలకి మించి రాణించాడు.

కానీ.. సూర్యకుమార్ వయసు  30 ఏళ్లుకాగా.. ఇషాన్ కిషన్ వయసు కేవలం 22 ఏళ్లే. దాంతో.. ధోని  తరహాలో యువ క్రికెటర్లలో ఉత్సాహం నింపేందుకు ఇషాన్ చేతికి ట్రోఫీని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. విరాట్ కోహ్లీ (80) నాటౌట్, రోహిత్ శర్మ (64) మెరుపు హాఫ్ సెంచరీలు, పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ తమదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్‌  2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డేవిడ్ మలాన్ (68) జోస్ బట్లర్ (52) హాఫ్‌ సెంచరీలతో పోరాడినా వారి వికెట్ల అనంతరం  ఇంగ్లండ్‌ జట్టు 188/8కే పరిమితమైంది. దాంతో.. 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ( చదవండి :ఆఖరి పోరులో అదరగొట్టారు )

మరిన్ని వార్తలు