Virat Kohli-Roger Federer: నేను చూసిన గొప్ప అథ్లెట్‌.. ఆరోజును మర్చిపోలేను: కోహ్లి.. వీడియో వైరల్‌

29 Sep, 2022 13:45 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: Virat Kohli Instagram)- రోజర్‌ ఫెదరర్‌ భావోద్వేగం

Virat Kohli- Roger Federer: స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ పట్ల టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిమానం చాటుకున్నాడు. తాను చూసిన గొప్ప అథ్లెట్లలో ఫెదరర్‌ ఒకరని.. అతడికి మరెవరూ సాటిరారని ప్రశంసలు కురిపించాడు. జీవితంలోని కొత్త దశను సైతం పూర్తిగా ఆస్వాదించాలని.. సరదాలు, సంతోషాలతో ఫెడ్డీ జీవితం నిండిపోవాలని ఈ స్టార్‌ బ్యాటర్‌ ఆకాంక్షించాడు.

కాగా స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లండన్‌ వేదికగా లేవర్‌ కప్‌-2022లో వ్యక్తిగతంగా చిరకాల మిత్రుడు, ఆటలో చిరకాల ప్రత్యర్థి అయిన స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.

అయితే, టీమ్‌ యూరోప్‌ తరఫున బరిలోకి దిగిన ఈ దిగ్గజ జంట టీమ్‌ వరల్డ్‌కు చెందిన జాక్‌ సాక్‌, ఫ్రాన్సిస్‌ టియాఫో చేతిలో ఓడిపోయింది. ఇక ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఫెడెక్స్‌ కోర్టులోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. రఫా సైతం కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఉన్న ఫొటో వైరల్‌ కాగా.. విరాట్‌ కోహ్లి ఆ ఫొటోను షేర్‌ చేస్తూ ఉద్వేగపూరిత ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. కోహ్లి.. ఫెదరర్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఏటీపీ టూర్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

ఇందులో.. ‘‘హల్లో రోజర్‌.. మాకు ఎన్నెన్నో మధురానుభూతులు, జ్ఞాపకాలు మిగిల్చిన నీకు ఇలా వీడియో ద్వారా విషెస్‌ చెప్పడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలిసి ఒకే ఒక్కసారి నిన్ను నేను నేరుగా కలిశాను.

2018 ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నీతో మాట్లాడాను. నా జీవితంలో నేను మర్చిపోలేని మధుర జ్ఞాప​కం అది. నీలాంటి గొప్ప అథ్లెట్‌ను నేనింతవరకు చూడలేదు. నువ్వు సంపాదించుకున్న ఈ కీర్తిప్రతిష్టలు మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు.

నీ భవిష్యత్తు మరింత అందంగా ఉండాలి. నీకు.. నీ కుటుంబానికి ఆల్‌ ది బెస్ట్‌. టేక్‌ కేర్‌’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఫెడ్డీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా ఫెదరర్‌ తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. ఇంకా మరెన్నో ఘనతలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. తర్వాత టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో ఆడనున్నాడు. ఇక ఇటీవలే అతడు తన కెరీర్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs SA ODI: అతడు అద్భుతమైన ఆటగాడు.. కానీ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదు.. అయినా: గంగూలీ 

మరిన్ని వార్తలు