WTC FINAL: టీమిండియాకు భారీ షాక్‌.. కెప్టెన్‌ కోహ్లీకి గాయం?

11 Jun, 2021 15:15 IST|Sakshi

సౌతాంప్టన్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియ‌న్షిప్(డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు ముందు టీమిండియాకు ఆందోళ‌న క‌లిగించే వార్త వెలువడింది. గురువారం నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది. నెట్స్‌లో పేసర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్‌ కోహ్లీ ప‌క్కటెముక‌ల‌ను తీవ్రంగా గాయపరిచిందని, దీంతో అతను మూడు నుంచి ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వ‌స్తుంద‌ని జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. 

ఒక‌వేళ కోహ్లీకి గాయం నిజమే అయితే, అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బేనని క్రికెట్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు రోజులుగా టీమిండియా స‌భ్యులంతా క‌లిసి ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో గురువారం కోహ్లీ, ష‌మీతో పాటు బుమ్రా, గిల్, ఇషాంత్‌, పుజారాలు నెట్స్‌లో చెమ‌టోడ్చారు. ఈ నెల 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య డబ్యూటీసీ ఫైన‌ల్ ప్రారంభం కానుండగా.. టీమిండియా ఆటగాళ్లు ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఫైనల్‌కు ముందు ఎటువంటి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్స్‌లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు సౌతాంప్టన్‌లోని మేఘావృత‌మైన వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డేందుకు జట్టు సభ్యులు ఎక్కువ సమయాన్ని గ్రౌండ్‌లోనే గడుపుతున్నారు.
చదవండి: నాడు అంతర్జాతీయ అథ్లెట్‌.. నేడు దినసరి కూలీ

>
మరిన్ని వార్తలు