ఎంపీఎల్‌లో కోహ్లి పెట్టుబడులు

7 Jan, 2021 05:33 IST|Sakshi

కెప్టెన్‌కు ‘పరస్పర విరుద్ధ’ సెగ

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)లో అతను రెండేళ్ల క్రితం పెట్టిన పెట్టుబడులు.... ఇప్పుడా సంస్థ (ఎంపీఎల్‌) కాస్త టీమిండియా కిట్‌ స్పాన్సర్‌ కావడంతో వివాదం రేగుతోంది. ఎంపీఎల్‌ సంస్థ కెప్టెన్‌కు గతంలో రూ. 33.32 లక్షల కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (సీసీడీ)ను కేటాయించింది. విరాట్‌ గత జనవరిలో ఎంపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ ఎండార్స్‌మెంట్‌కు సంబంధిం చిన పారితోషికాన్ని షేర్లు, డిబెంచర్ల రూపంలో అతనికి ఇచ్చింది. ఆటగాడ న్నాక కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్లు సర్వసాధారణం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ఎంపీఎల్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ కిట్, జెర్సీ స్పాన్సర్‌షిప్‌ ఇచ్చింది. కెప్టెన్‌ పెట్టుబడులున్న సంస్థకు స్పాన్సర్‌షిప్‌ దక్కడం పైనే ఇప్పుడు వివాదం రేగింది. ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై కోహ్లిగానీ, క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) గానీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు