డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు: కోహ్లి

5 Feb, 2021 15:31 IST|Sakshi

టీమిండియాకు ఖచ్చితంగా టాప్‌ ర్యాంకే ఇస్తాను

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నటీ సెలవులు ముగించుకుని జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఏళ్ల తరబడి క్రికెటర్‌గా ఉండటం వల్ల కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుతున్నానని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో కోహ్లి తండ్రి అయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన కొత్త బాధ్యతల గురించి తెలియజేశాడు. డైపర్లు మార్చడం మరీ అంత కష్టమైన పనేం కాదన్నాడు.

‘‘ఏళ్లుగా క్రికెట్‌ ఆడటం వల్ల చాలా విషయాలను సులువుగా అర్థం చేసుకునే లక్షణం అబ్బింది. నేర్చుకున్న ప్రతి విషయంలో మాస్టర్‌ని కాకపోవచ్చు కానీ.. మేనేజ్‌ చేయగలను. ఇక రవీ భాయ్‌ వల్ల క్రీజులో, బయట అన్ని విషయాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగింది. పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోగలగడం క్రికెట్‌ వల్ల సాధ్యమయ్యింది. ఇదే అంశం తండ్రి అయ్యాక నాకు బాగా పనికి వచ్చింది. డైపర్లు మార్చడం.. పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల గురించి ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు. అయితే ఈ పనిలో నేను ఇంకా మాస్టర్‌ని కాలేదు’’ అన్నాడు.

ఇక బ్రిస్బెన్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత టీమిండియాకు ఏ ర్యాంక్‌ ఇస్తారని ప్రశ్నించగా.. ఖచ్చితంగా టాప్‌ అనే వెల్లడించాడు కోహ్లి. ‘‘ఎందుకంటే బ్రిస్బెన్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో పోల్చితే మాకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని తట్టుకుని మేం విజయం సాధించాం. అందుకే టాప్‌ ర్యాంక్‌ ఇస్తానని’’ తెలిపాడు. ఇక ఈ వీడియోలో కోహ్లి, టీమిండియా కోచ్‌ రవి శాస్త్రిలు పలు అంశాల గురించి ముచ్చటించారు. 

చదవండి: నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు..
చదవండి:
  ‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’

మరిన్ని వార్తలు