విరాట్‌కు విశ్రాంతి పొడిగింపు.. మూడో వన్డేలో కూడా బెంచ్‌కే పరిమితం..?

31 Jul, 2023 19:47 IST|Sakshi

విండీస్‌తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియా.. మూడో వన్డేలో కూడా అదే బాట పట్టనున్నట్లు తెలుస్తుంది. రెండో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌కు విశ్రాంతినిచ్చిన మేనేజ్‌మెంట్‌.. మూడో వన్డేలో రోహిత్‌ను జట్టులోకి తెచ్చి, విరాట్‌కు విశ్రాంతిని పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ట్రినిడాడ్‌ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్‌కు ముందు జట్టుతో పాటు విరాట్‌ కనిపించకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. ఈ విషయంపై బీసీసీఐ నుంచి కానీ, మేనేజ్‌మెంట్‌ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కోహ్లికి రెస్ట్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వాలన్నది టీమిండియా యోచనగా తెలుస్తుంది.  

ఇదిలా ఉంటే రోహిత్‌, కోహ్లి లేని టీమిండియా ప్రయోగం రెండో వన్డేలో మిస్‌ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా వరల్డ్‌కప్‌కు కూడా అర్హత సాధించలేని విండీస్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా విండీస్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. విండీస్‌ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (55), శుభ్‌మన్‌ గిల్‌(34) మాత్రమే రాణించారు. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెఫర్డ్‌, గుడకేశ్‌ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా  లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ హోప్‌ (63 నాటౌట్‌), కార్టీ (48 నాటౌట్‌) విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్‌ 2019 తర్వాత ఓ వన్డేలో టీమిండియాపై గెలవడంతో ఈ మ్యాచ్‌ ఫలితానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్ట్‌ 1న భారత్‌-విండీస్‌ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ అనంతరం భారత్‌.. విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు