Brett Lee: కోహ్లిని మించినోడు భూప్రపంచంలో లేడు.. ఇలాంటి వారు తరానికొక్కరు పుడతారు..!

17 Sep, 2022 17:53 IST|Sakshi

టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం బ్రెట్‌ లీ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని మించినోడు ఈ భూప్రపంచంలో లేడని ఆకాశానికెత్తాడు. కోహ్లి లాంటి ఆటగాడు తరానికొక్కరు పుడతారని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇదే సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా, జాక్‌ కలిస్‌లను కూడా శ్లాఘించాడు. క్రికెట్‌లో వీరంతా ఆణిముత్యాలని కొనియాడాడు. చాలా మంది లాగే తాను కూడా కోహ్లికి వీరాభిమానినని తెలిపాడు. 

ఇదే సందర్భంగా లీ.. కోహ్లి ఫామ్‌పై కూడా స్పందించాడు. ఎంత రన్‌మెషీన్‌ అన్ని పిలుచుకుంటే మాత్రం ప్రతి మ్యాచ్‌లో కోహ్లి వందకొట్టాలని ఆశించడం అత్యాశ అవుతుందని అన్నాడు. ఇది అతనిపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందని పేర్కొన్నాడు. 1020 రోజుల పాటు కోహ్లి సెంచరీ చేయలేకపోవడానికి ఇదే కారణమని తెలిపాడు. 130 కోట్ల మంది భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోహ్లి నుంచి ప్రతి మ్యాచ్‌లో సెంచరీ ఆశించడం సబబు కాదని చెప్పుకొచ్చాడు. 

కోహ్లిని ప్రతి మ్యాచ్‌కు ముందు భూతద్దంలో చూడటం మానేసి, అతని పాటికి అతన్ని వదిలేస్తే సత్ఫలితాలు వస్తాయని సూచించాడు. క్రికెట్‌కు కోహ్లి కోహీనూర్‌ అని, అతనో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అని కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఇదే సందర్భంగా  లీ.. సచిన్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. సచిన్‌ ఎంతో సౌమ్యమైన క్రికెటర్‌ అని, అతని ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తన, అఫ్‌ ద ఫీల్డ్‌ ప్రవర్తన ఒకేలా ఉంటాయని, సచిన్‌ని అందరూ అభిమానించేవారని తెలిపాడు. సచిన్‌కు బ్యాటింగ్‌ చేస్తున్న మాట్లాడితే అస్సలు నచ్చేది కాదని చెప్పాడు. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకు భారత్‌కు వచ్చిన లీ.. మీడియాతో ఈ విషయాలకు పంచుకున్నాడు. 
 

మరిన్ని వార్తలు