వరల్డ్‌ టాప్‌ 100 హైయెస్ట్‌ పెయిడ్‌ అథ్లెట్స్‌ జాబితాలో ఏకైక భారతీయుడిగా విరాట్‌ కోహ్లి

12 May, 2022 12:26 IST|Sakshi

Virat Kohli Is The Only Indian In Top 100 Highest Earning Athletes: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. గత రెండున్నరేళ్లుగా ఫామ్‌ లేమితో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. సంపాదనలో వరల్డ్‌ హైయెస్ట్‌ పెయిడ్‌ టాప్‌ 100 అథ్లెట్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. స్పోర్టికో విడుదల చేసిన ఈ జాబితాలో విరాట్‌ ఏకైక భారతీయ అథ్లెట్‌ కావడం విశేషం. 2021-22 సంవత్సరానికి గానూ అత్యధిక రాబడి కలిగిన ప్రపంచ అథ్లెట్లలో విరాట్‌ 61 స్థానంలో నిలిచాడు. అతని ఆదాయం 33.9 మిలియన్‌ డాలర్లుగా ఉంది. కోహ్లి మినహా మరే ఇతర భారతీయ అథ్లెట్‌కు ఈ స్థాయిలో ఆదాయం లేదు. 


ఈ జాబితాలో ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ 126.9 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలువగా.. ఫుట్‌బాల్ దిగ్గజ త్రయం లియోనల్ మెస్సీ (122 మిలియన్‌ డాలర్లు), క్రిస్టియానో రొనాల్డో (115 మిలియన్‌ డాలర్లు), నెయ్‌మార్‌ (103 మిలియన్‌ డాలర్లు) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాలను ఆక్రమించారు. ఐదో స్థానంలో ప్రొఫెషనల్‌ బాక్సర్ కెనెలో అల్వారెజ్ (89), 8వ స్థానంలో టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్ ఫెదరర్ (85.7), 10వ స్థానంలో గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ (73.5) నిలిచారు. 

ఇక విరాట్‌ ప్రస్తుత ఫామ్‌ విషయానికొస్తే.. రన్‌ మెషీన్‌ ప్రస్తుత ఐపీఎల్‌లో సీజన్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతనిప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 19.6 సగటున కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు గోల్డెన్‌ డకౌట్లు (తొలి బంతికే ఔట్‌) కూడా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి ఫామ్‌ ఇంతకంటే దారుణంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో అతను సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు అవుతుంది. పేలవ ఫామ్‌ కారణంగా టీమిండియాలో అతని స్థానం కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ కోహ్లి ఆదాయం ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.
చదవండి: IPL 2022: ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ.. క్లూ ఇచ్చిన కోహ్లి

మరిన్ని వార్తలు