తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి.. ట్రోలింగ్‌!

10 Nov, 2020 14:38 IST|Sakshi

ధోని జీవాను చూసేందుకు ఇండియాకు రాలేదు!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని, అయితే అదే సమయంలో జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తండ్రి చనిపోయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించిన గొప్ప ఆటగాడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందంటున్నారు. కోహ్లి వంటి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అందుబాటులో లేకుంటే ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఓటమి తప్పదంటూ జోస్యం చెబుతున్నారు. కాగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నట్లు బీసీసీఐ వెల్లడించిన విషయం విదితమే. కోహ్లి సతీమణి, నటి అనుష్క శర్మ డెలివరీ తేదీ జనవరిలో ఉండటంతో, ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు అతడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అతడి అభ్యర్థనను మన్నించిన బీసీసీఐ పెటర్నటీ లీవ్‌ మంజూరు చేసింది. 

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనితో పోలిక తెచ్చిన నెటిజన్లు, కోహ్లి వ్యవహారశైలిని విమర్శిస్తున్నారు. దేశం తరఫున ఆడటం కంటే వ్యక్తిగత విషయాలకే కోహ్లి ప్రాధాన్యం ఇస్తున్నాడని, కానీ ధోని మాత్రం జీవా(ధోని కూతురు) జన్మించిన సమయంలో భార్యాపిల్లలను వదిలి జట్టును ముందుకు నడిపించడంపై దృష్టి సారించాడని పేర్కొంటున్నారు. కాగా 2015 ప్రపంచకప్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో ధోని సతీమణి సాక్షి జీవాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీమిండియా ఫైనల్‌ వార్మప్‌ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు(ఫిబ్రవరి 6న) జీవా జన్మించింది. ఆ సమయంలో.. ఇండియాలో ఉండకపోవడం వల్లే మీరు మీ తొలి సంతానానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలకు దూరమవుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అదేం లేదు. ప్రస్తుతం నేను దేశం తరఫున జాతీయ జట్టును ముందుకు నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాను. వేరే విషయాల గురించి అంతగా ఆలోచించడం లేదు. ప్రపంచకప్‌ ఆడటం చాలా ముఖ్యం’’  అంటూ సమాధానమిచ్చాడు. (చదవండి: టెస్టు జట్టులోకి రోహిత్‌ శర్మ ఎంపిక)

ఇక కోహ్లి సెలవు తీసుకున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న నెటిజన్లు.. ‘‘ తన తండ్రి చనిపోయినపుడు కూడా జట్టును గెలిపించేందుకు బాధను పంటిబిగువన భరించిన కోహ్లి, ఇప్పుడు మాత్రం ఎందుకో అలా ఆలోచించలేకపోతున్నాడు. అతడి నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ధోని మాత్రం ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. జీవాను చూసేందుకు ఇండియాకు రాలేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్‌ హర్షా బోగ్లే.. ‘‘బాగుంది.. ఇదొక పెద్ద వార్తే. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు తర్వాత, తన బిడ్డను చూసుకునేందుకు కోహ్లి ఇండియాకు వస్తున్నాడు. మోడర్న్‌ ప్లేయర్‌కి ప్రొఫెషన్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ముఖ్యమే. అయితే కోహ్లి లేకుంటే జట్టు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ట్వీట్‌ చేశాడు. అయితే కోహ్లి అభిమానులు మాత్రం అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కాబోయే తల్లిదండ్రులకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు. 

మూడు టెస్టులకు దూరం
రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్‌ 27, 29, డిసెంబర్‌ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్‌ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్‌ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు. 

మరిన్ని వార్తలు