రహానే కెప్టెన్సీ భేష్‌..

26 Dec, 2020 17:30 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్ల సంబరం(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కితాబిచ్చాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రహానే ఎంతో తెలివిగా ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడంటూ కొనియాడాడు. ఈ మేరకు.. ‘‘మొదటి రోజు ఆటలోనే, కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం గొప్ప విషయం. రహానే, బౌలర్ల సేవలను ఉపయోగించుకున్న తీరు అమోఘం. ఫీల్డింగ్‌ విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉంది’’ అని వీరూ ట్వీట్‌ చేశాడు. (చదవండి: రెండో టెస్టు: హో విల్సన్‌, ఇది చీటింగ్‌!)

ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం జట్టు ఆట తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలి రోజు. బౌలర్లు గొప్పగా రాణించారు. అద్భుతమైన ముగింపు కూడా’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా తన భార్య, నటి అనుష్క శర్మ తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో అజింక్య రహానే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఒక వికెట్‌ కోల్పోయి 36 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో  బుమ్రా 4, అశ్విన్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసి సత్తా చాటడంతో.. ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్‌ అయింది. కాగా బాక్సింగ్‌ డే టెస్టుతో హైదరాబాదీ సిరాజ్‌ సంప్రదాయ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు.

మరిన్ని వార్తలు