అద్భుతం: రహానే కెప్టెన్సీపై దిగ్గజాల ప్రశంసలు..

29 Dec, 2020 13:16 IST|Sakshi

దెబ్బతిన్న పులిని తక్కువగా అంచనా వేయొద్దు

న్యూఢిల్లీ: బాక్సింగ్‌ డే టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌, టెస్ట్‌ స్పెషలిస్ట్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వంటి దిగ్గజాలు సహా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇతర ఆటగాళ్లు రహానే సేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘విరాట్‌, రోహిత్‌, ఇషాంత్‌, షమీ వంటి ఆటగాళ్లు లేకుండానే టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం అనేది అత్యద్భుతమైన విజయం. మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ వెంటనే తేరుకుని సిరీస్‌ను సమం చేసిన జట్టు తీరు అమోఘం. బ్రిలియంట్‌ విన్‌. వెల్‌డన్‌ టీమిండియా’’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.(చదవండి: ఆ క్రెడిట్‌ వాళ్లిద్దరిదే: రహానే )

ఇక తొలి టెస్టు అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి.. ‘‘ ఎంతటి ఘన విజయం ఇది.. జట్టు మొత్తం అద్భుతంగా రాణించింది. కేవలం ఆటగాళ్లే కాదు.. వారిని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చిన నాయకుడి వ్యూహం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను’’ అంటూ తాత్కాలిక కెప్టెన్‌ రహానేను కొనియాడాడు. ఇక వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం.. ‘‘ఈ విజయంతో ఎన్నెన్నో సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. రహానే కెప్టెన్సీ భేష్‌.. బౌలర్లు.. ముఖ్యంగా ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. కీలక మ్యాచ్‌లో వాళ్లిద్దరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. దృఢమైన బెంచ్‌ ఉండటమే ఇండియన్‌ క్రికెట్‌కు ఉన్న అతిపెద్ద బలం’’ అని గిల్‌, సిరాజ్‌పై ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించాడు.

అదే విధంగా.. ‘‘టీమిండియా అద్భుతమైన ప్రదర్శన. దెబ్బతిన్న పులిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు’’ అంటూ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ పింక్‌బాల్‌ టెస్టులో పరాజయానికి భారత జట్టు దీటుగా బదులిచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు