వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు: కోహ్లి

10 Jan, 2021 19:33 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా క్రికెటర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్య‌ల‌పై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌లో ఇలాంటి వాటికి తావులేదని.. ఎవరైనా అలా చేస్తే మరే మ్యాచ్‌కు అనుమతి లేకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలని పేర్కొన్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బుమ్రా, సిరాజ్‌ల విషయంపై ట్విటర్‌లో సీరియ‌స్ అయ్యాడు.(చదవండి: బ్రౌన్‌ డాగ్‌.. బిగ్‌ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి)

'ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో కొందరు అభిమానులు వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌కు పెట్టింది పేరైన క్రికెట్‌లో జాత్యహంకార వ్యాఖ్య‌లు స‌హించ‌రానివి. గ్రౌండ్‌లో ఇప్ప‌టికే ఇలాంటి ఎన్నో ఘ‌ట‌న‌లు చూశాం.. కానీ ఇవాళ చేసిన పని అస‌లు సిస‌లు రౌడీ ప్ర‌వ‌ర్త‌న‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌పాలి. మ‌ళ్లీ ఇలాంటివి జ‌ర‌గ‌కుండా బాధ్యుల‌పై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ంటూ' విరాట్ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా సిడ్నీ టెస్టులో మూడో రోజు ఆటలో సిరాజ్‌, బుమ్రాను లక్ష్యంగా చేసుకొని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కొంత‌మంది.. నాలుగోరోజు మరోసారి సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు రెండో సెషన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బ్రౌన్ డాగ్, బిగ్‌ మంకీ అంటూ సిరాజ్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సిరాజ్‌ ఫిర్యాదుతో ఆ వ్యాఖ్య‌లు చేసిన వారిని పోలీసులు బ‌య‌ట‌కు పంపించేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై ఐసీసీ కూడ సీరియస్‌ అయింది. టీమిండియా ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఐసీసీ విచారణను కూడా చేపట్టింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్‌)

మరిన్ని వార్తలు