నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్‌ కోహ్లి

27 Oct, 2022 15:58 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి.. క్రీడాభిమానులు తనను GOAT (Greatest Of All Time) అని సంబోధించడంపై అభ్యంత​రం వ్యక్తం చేశాడు. తన పేరు ముందు అంత పెద్ద ట్యాగ్‌ను తగిలించవద్దని విజ్ఞప్తి చేశాడు. తాను ఆ బిరుదుకు అర్హున్ని కాదని ఖరాఖండిగా చెప్పాడు. నా అభిమానులైనా సరే నన్ను GOAT అని పిలిస్తే అంగీకరించనని, అలా పిలుపించుకునే అర్హత ప్రపంచ క్రికెట్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని తెలిపాడు. ఆ ఇద్దరు తాను అమితంగా ఆరాధించే దిగ్గజ ప్లేయర్లు వివియన్‌ రిచర్డ్స్‌, సచిన్‌ టెండూల్కర్‌ అని పేర్కొన్నాడు. 

టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాక్‌పై ఆడిన చారిత్రక ఇన్నింగ్స్‌ అనంతరం సోషల్‌మీడియాలో విరాట్‌ గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అనే ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది. దీనిపై ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు విరాట్‌ ఈ మేరకు స్పందించాడు. 

కాగా, గత ఆదివారం (అక్టోబర్‌ 23) పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీ బాది కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో కొనసాగున్నాడు. పాక్‌పై 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్‌ 27) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 1000 రోజుల తర్వాత పూర్వవైభవాన్ని సాధించిన కింగ్‌ కోహ్లి.. ఆతర్వాత వెనుదిరిగి చూడట్లేదు. రన్‌మెషీన్‌, కింగ్‌ కోహ్లి, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ బిరుదులకు వంద శాతం అర్హుడినని రుజువు చేసుకుంటున్నాడు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు