మాట తప్పావంటూ ట్రోలింగ్‌.. కోహ్లి కౌంటర్‌

1 Jun, 2021 18:35 IST|Sakshi

డైట్‌లో గుడ్లు తీసుకుంటానన్న కోహ్లి

శాఖాహారివి అయ్యుండి గుడ్లు ఎలా తింటావంటూ ట్రోలింగ్‌

స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన కోహ్లి

ముంబై: మూడేళ్ల క్రితం తాను శాఖాహారిగా మారినట్లు వెల్లడించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. తాజాగా రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ.. తన డైట్‌లో గుడ్లు తీసుకుంటానని తెలిపాడు. వెజిటేరియన్‌ అని చెప్పి గుడ్లు తింటావా.. ఇదేంది కోహ్లి అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై కోహ్లి ఘాటుగా స్పందించాడు. నేను శాఖాహారినని ఎప్పుడు చేప్పలేదే అన్నాడు. 

తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లి.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా తన డైట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్‌లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోశలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని మితంగా తీసుకుంటానని తెలిపాడు. ఇక కోహ్లి గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్‌గా మారనని గతంలో చెప్పిన కోహ్లి ఇప్పుడేలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 

గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా వేదికగా లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు. వెన్నుముకలో తలెత్తిన సమస్య కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అది తనకు మేలు చేసిందని కూడా చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించిన అభిమానులు కోహ్లిపై విమర్శల వర్షం కురిపిస్తూ.. తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాఖాహారి అని చెప్పి కోహ్లి గుడ్లు తింటున్నావా..  గుడ్లు నాన్‌వెజ్ కాదనుకుంటా.. అంటూ కామెంట్ చేశారు. కోహ్లి కూడా మనలానే మాట తప్పాడని మరికొందరు విమర్శించారు.

ఈ ట్రోలింగ్‌పై స్పందించిన కోహ్లి.. ఘాటుగానే బదులిచ్చాడు. 'నేను శాఖాహారిని అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికే అలానే ఉంటానని కూడా అనలేదు. గట్టిగా గాలి పీల్చుకొని మీ కూరగాయాలు మీరు తినండి' అంటూ ఫన్నీ ఎమోజీలతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లో క్వారంటైన్‌ పాటిస్తున్నాడు. ఇక బుధవారమే టీమిండియా.. ఇంగ్లండ్‌కు పయనం కానుంది. 

చదవండి: ఏంటి కోహ్లి..  ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ? 

మరిన్ని వార్తలు